ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడచిన ఐదేళ్లలో అధికారంలో ఉన్న సమయంలో రాజధాని ఏర్పాటు ప్రాంతంపై సన్నిహితులకు లీకులు ఇచ్చారని రైతుల నుండి సన్నిహితులు భారీగా భూములు కొనుగోలు చేసిన తరువాత రాజధానిగా అమరావతిని ప్రకటించారని క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) దర్యాప్తులో వెల్లడైంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో కొందరు టీడీపీ నేతలపై కేసులు పెట్టేందుకు సీఐడీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, పల్లె రఘునాథా రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, జీవీఆర్ ఆంజనేయులు, కొమ్మలపాటి శ్రీధర్, ఇతరులపై కేసులు నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధమైనట్లు సమాచారం. సీఐడీ వీరిపై 409,403,406, 420,418 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 
 
సీఐడీ ఇప్పటికే దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిందని సమాచారం. సీఐడీ ప్రాథమికంగా టీడీపీ నేతలు నల్లధనంతో భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారణకు వచ్చిందని తెలుస్తోంది. సీఐడీ సీఆర్‌డీఏ పరిధిలో జూన్ నెల 2014 నుండి డిసెంబర్ నెల చివరి వరకు జరిగిన భూముల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుండి వివరాలను సేకరించి క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. 
 
కృష్ణా జిల్లాకు చెందిన ఒక టీడీపీ నేత రాజధాని ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత ఆ భూములను ఎన్నారైలకు విక్రయించి 400 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి పొందినట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వర్గాల అంచనాల ప్రకారం టీడీపీ నేతలు కనిష్టంగా 15వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సమాచారం. చంద్రబాబు ముందే సమాచారం ఇచ్చి భూములు కొనుగోలు చేయించినట్టు రాజధానిని ప్రకటించిక ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేసినట్టు వెలుగులోకి వస్తున్న రిజిస్టేషన్ పత్రాలే సాక్ష్యాలుగా చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: