చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.  మృతుల సంఖ్య 817కి చేరింది.    పదిహేడేళ్ల క్రితం ప్రపంచాన్ని భయపెట్టిన సార్స్ మహమ్మారి కంటే భయానకంగా మారుతోంది ఈ కరోనా. సార్స్ వైరస్  774 మందిని బలితీసుకుంటే... కరోనా అంతకు మించి కబళిస్తోంది.  వూహాన్ సిటీలో 6 వేల మంది కరోనా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది.  మరోవైపు కరోనా సోకే ప్రమాదం ఉన్న తొలి 20 దేశాల్లో భారత్ కూడా ఉండటం కలకలం రేపుతోంది.

 

కరోనా వైరస్ బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చైనాలో ఇప్పటివరకు 817 మంది చనిపోయారని చైనా హెల్త్ కమిషన్ ధృవీకరించింది.  నిన్న  ఒక్కరోజు   హుబీలో 81 మంది మంది చనిపోవడం కలకలం రేపుతోంది.  చైనా సెంట్రల్ ప్రావిన్స్‌లో మరో 2 వేల147 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 37 వేల 200గా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో వైరస్‌ని విసృతిని అరికట్టగలిగామని.. కానీ అది అలానే ఉంటుందా అంటే మాత్రం చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.  

 

 కొత్త కేసులు నమోదవుతున్నా చైనాలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వుహాన్, హుబేయ్ ప్రావిన్స్‌లలో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగానే ఉందని ప్రకటించింది. హుబీ రాజధాని వుహన్‌లో  క్రూర మృగాలను విక్రయించే మార్కెట్ గుండా వైరస్ వ్యాప్తి చెందిదని చైనా హెల్త్ కమిషన్ చెబుతోంది. అదీ క్రమంగా విస్తరించి  ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వ్యాపించిందని తెలిపింది.

 

 కరోనా బారిన పడే అవకాశం ఉన్న దేశాల పేర్లను  జర్మనీకి చెందిన హంబోల్ట్ యూనివర్సిటీ ఓ జాబితా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ జాబితా భారత్‌ను ఆందోళనకు గురిచేస్తుంది.  జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌ల్యాండ్ దేశాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని ఈ జాబితా పేర్కొంది.  లిస్ట్ లో భారత్‌ను 17వ దేశంగా చేర్చారు. మన దేశంలో  ఈ వైరస్ వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి.   పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం కోసం కేంద్రం మంత్రులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: