దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిన్న కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. నలుగురు దోషులకు ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు తాజాగా జారీ చేసిన డెత్ వారెంట్ లో పేర్కొంది. నిన్న కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన తరువాత దోషులకు అన్ని న్యాయపరమైన అవకాశాలు ఉపయోగించుకున్నట్లు వార్తలు వినిపించాయి. 
 
కానీ ఈ కేసులో తాజాగా షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ కుమార్ తాజాగా మరోసారి సుప్రీంను ఆశ్రయించారు. ముకేశ్ న్యాయస్థానాన్ని మరోసారి క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తొలిసారి జనవరి 7వ తేదీన డెత్ వారంట్ జారీ అయిందని... డెత్ వారంట్ జారీ అయిన వారంలోగా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని లాయర్ వృందా గ్రోవర్ తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. 
 
ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి జనవరి 17న తిరస్కరించారు. రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ముకేశ్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. సుప్రీం నిందితుని వాదనతో ఏకీభవిస్తే మరోసారి ఉరి అమలు వాయిదా పడుతుంది. న్యాయవ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకొని నిర్భయ దోషులు, అతని లాయర్లు దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
నిర్భయ తల్లి దోషులకు ఉరిశిక్ష పడినా అమలు వాయిదా పడుతూ ఉండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్భయ దోషులకు ఉరి అమలు చేసి తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తన కూతురు ఆస్పత్రిలో కనీసం నీళ్లు కూడా తాగలేకపోయిందని అన్నారు. నిర్భయ ఘటన జరిగి దాదాపు ఏడేళ్లయింది. ఆరుగురు నిర్భయపై కదులుతున్న బస్సులో అత్యాచారానికి పాల్పడగా దోషుల్లో ఒకరు తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: