వరంగల్ ఎంజీఎం అధికారుల తీరు మారటం లేదు. కరోనా వ్యాధి అనుమానంతో ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. సాధారణ ఎమర్జెన్సీ వార్డుల్లోకి కరోనా అనుమానితులను తీసుకురావడంపై రోగుల బంధువులు...సిబ్బంది అభ్యంతరం చెబుతున్నారు.  

 

వరంగల్ ఎంజీఎం వైద్యాధికారులు అన్ని వేళల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తారనే ఉన్న విమర్శలను నిజం చేసేలా  వ్యవహరిస్తున్నారు.  ప్రపంచాన్ని బయపెడుతున్న కరోనా విషయంలో ఎంజీఎం ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కరోనా అనుమానాల లక్షణాలతో ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన నిట్ విద్యార్థిని నేరుగా సాధారణ రోగులు ఉండే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం అంటూ సుమారు 45 నిమిషాల పాటు అడ్మిషన్ల ఫామ్ నింపాలంటూ అక్కడే ఉంచారు. 45 నిమిషాల తర్వాత  సుమారు వంద మంది ఉండే వార్డుల గుండా  కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చిన నిట్ విద్యార్థిని కరోనా వార్డుకు ఎంజీఎం సిబ్బంది తీసుకెళ్లారు. అదృష్టవశాత్తూ నిట్ విద్యార్థికి కరోనా రిపోర్టు నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే నిట్ విద్యార్థి పట్ల ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుతో కచ్చితంగా పదుల సంఖ్యలో రోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది అని ఎంజీఎం ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

 నిట్ విద్యార్థి తీరుతో విమర్శల పాలైన ఎంజీఎం అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన దంపతుల పట్ల కూడా అలాగే వ్యవహరించారు. ఎంజీఎంకి వచ్చిన సమయంలోను సాధారణ రోగులతో పాటు ఎమర్జెన్సీ చికిత్స తీసుకునే వార్డులోనే కరోనా అనుమానితులకు టెస్టులు చేశారు. దీనిపై ఎమర్జెన్సీ వార్డులో చికిత్స  తీసుకుంటున్న రోగుల బందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఎంజీఎంలోని రోగులు...రోగుల అటెండర్లు ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో పేషేంట్ ఉన్నాడని తెలిసి భయబ్రాంతులకు గురయ్యారు. కనీసం సిబ్బంది మాస్కులు కూడా ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యం ఇవ్వడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 వేల మాస్కులు ఉన్నా వైద్యులు. సీనియర్ సిబ్బంది తప్ప మిగిలిన వాళ్లకు ఎలాంటి మాస్క్ లు ఇవ్వడం లేదు. కరోనా వార్డులో ఉండే సిబ్బంది కనీసం గౌన్స్ అందుబాటులో ఉంచలేదు. నిట్ విద్యార్థి ఎంజీఎంకి వచ్చిన సమయంలో అతని హిస్టరీ తీసుకునే క్రమంలో కరోనా వార్డులో ఉన్న వైద్య సిబ్బంది ఎవ్వరు కూడా గౌన్స్ వాడలేదు. వసతులు లేకున్నా ఎంజీఎం ఉన్నతాధికారులు నామమాత్రంగా కరోనా వార్డును ఏర్పటు చేశారు. ఇటు రోగులు అటు ఎంజీఎం సిబ్బందిని రిస్క్ లో  పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: