వైసిపి ప్రభుత్వం కూడా తాను చెప్పినట్లే వినాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది.  విషయం ఏదైనా కానీండి  ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం ఏమి చేయాలో తానే చెప్పేస్తున్నారు. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారన్న కనీస ఇంగతాన్ని కూడా చంద్రబాబు కోల్పోవటమే విచిత్రంగా ఉంది.

 

తాజాగా స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా విషయాన్నే తీసుకుందాం.  ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నారని జగన్ తీవ్రంగా ఆక్షేపించాడు. సరే నిమ్మగడ్డ నిర్ణయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయటమే కాకుండా కోర్టులో కేసులు కూడా వేయించాడు.  ఆ వివాదాన్ని ప్రభుత్వం-ఎన్నికల కమీషన్ చూసుకుంటాయి. కానీ మధ్యలో చంద్రబాబు వేలు పెట్టేశాడు. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కమీషనర్ కు లేఖ రాయటాన్ని తప్పుపట్టారు.

 

అలాగే నిమ్మగడ్డ నిర్ణయంపై ప్రభుత్వం కోర్టులో కేసు వేయటాన్ని కూడా తప్పు పట్టేశారు. కోర్టులో ప్రభుత్వం కేసు వేయకూడదట. ప్రజల ఆరోగ్యం కన్నా ముఖ్యమంత్రికి ఎన్నికలే ముఖ్యమా అంటూ నానా తిట్లు తిట్టేశాడు. ఎన్నికల కమీషనర్ ను జగన్ ఆక్షేపించిన విషయంలో కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే విచిత్రం. మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేదిని చంద్రబాబు ఎంతగా బెదిరించాడో అందరూ చూసిందే.

 

అప్పటి ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేతాను బదిలి చేస్తే ఎన్నికల కమీషన్ ను ఎన్ని మాటలన్నది అందరికి తెలిసిందే. ఎన్నికల కమీషన్ నియమించిన ఎల్వి సుబ్రమణ్యం ను ప్రతిరోజు తాను తిట్టటమే కాకుండా తన మంత్రులతో కూడా వంతుల వారీగా తిట్టించిన విషయం అందరికీ గుర్తే. ఇలాంటి చరిత్రున్న చంద్రబాబు ఈరోజు జగన్ కు నియమ, నిబంధనలు గుర్తు చేస్తు నీతులు చెబుతున్నారు. బహుశా మొన్నటి ఎన్నికల్లో తాను ఓడిపోయిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయారేమో  ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: