తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లంతా విదేశాలకు చెందినవారే అని అన్నారు. తెలంగాణ వాసులకు ఒక్కరికి కూడా కరోనా సోకలేదని స్పష్టం చేశారు. 
 
హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ తో గాంధీ ఆస్పత్రిలో జాయిన్ అయిన వ్యక్తికి కరోనా పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు చేపట్టామని... మొదట తెలంగాణలోనే థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో 66,162 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేశామని అన్నారు. 
 
రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న 4,160 మంది పరీక్షలు జరపగా వారిలో ఐదు మందికి ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. యూఏఈ విమానాలను రేపు సాయంత్రం నుండి నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. ఎవరిలోనైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. 
 
వికారాబాద్ లోని క్వారంటైల్ సెంటర్ కు చైనా, జర్మనీ, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ నుంచి వచ్చేవాళ్లను తరలిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. పరిశోధకులు ఒక వ్యక్తిపై వ్యాక్సిన్ ను ప్రయోగించారు. తొలి దశ ప్రయోగాన్ని భారత్, నార్వే సహాయ సహకారాలతో ప్రారంభించారు. 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై ఈ పరిశోధనలు జరపనున్నారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్ల మీద సంచరించే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: