నిర్భయ దోషులు తమ ఉరిశిక్షపై స్టే విధించాలని ఢిల్లీలోని పాటియాలా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఉరి వాయిదా వేయించడానికి నిందితులు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఇప్పటికే న్యాయవకాశాలు ముగిసిపోయినప్పటికీ పలు పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారు. రేపు ఉదయం 5.30 గంటలకు దోషులకు ఉరి తీయాల్సి ఉండగా ఉరిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు దోషులు పాటియాలా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 
 
పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్ పిటిషన్లలో న్యాయపరమైన నిబంధనలను పాటించకుండా తమ క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు నిర్భయ దోషులు పెట్టుకున్న పిటిషన్లను కొట్టివేసింది. పిటిషన్లు కొట్టివేయడంతో రేపు యథావిథిగా ఉరి అమలు కానుంది. నిన్న తీహార్ జైలులో ఉరికి సంబంధించిన రీహార్సల్స్ పూర్తయ్యాయని సమాచారం. 
 
తలారి ఉరిశిక్షను అమలు చేయడానికి ముందు డమ్మీ ఉరి ట్రయల్స్ ను నిర్వహించాడు. కోర్టు పిటిషన్లు కొట్టివేయడంతో ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఉరి నాలుగోసారి ఆటంకం లేకుండా అమలుకానుంది. దోషులు ఉరి నుండి తప్పించుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ అక్కడినుండి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. 
 
నిందితులకు ఉరిశిక్ష అమలు కానుండడంతో దోషులలో ఒకరైన వినయ్ శర్మ తల్లి తన కొడుకుకు ఇష్టమైన ఆహారాన్ని అందించే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. పూరీ, సబ్జీ, కచోరీ అంటే తన కొడుకుకు ఎంతో ఇష్టమని ఆమె అన్నారు. 2012 సంవత్సరంలో డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో నిర్భయపై ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె సింగపూర్ లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడగా మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: