దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలైంది. తీహార్ జైలులో తెల్లవారుజామున 5.30 గంటలకు వినయ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్ లను ఉరి తీశారు. మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జైలు అధికారుల సమక్షంలో దోషులను మనీలా తాళ్లతో ఉరి తీశారు. తీహార్ జైలులో ఒకే నేరానికి సంబంధించి నలుగురు దోషులను ఉరి తీయడం ఇదే తొలిసారి. 
 
నిర్భయ దోషులు ఉరిని ఆపడానికి చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశారు. దోషులలో ఒకరైన పవన్ గుప్తా ఈ ఉదంతం జరిగిన సమయంలో తాను మైనర్ నని పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. పవన్ గుప్తా లాయర్ గతంలో జైలు అధికారులు అతడిని కొట్టారని... ఉరిని రెండు రోజులు వాయిదా వేయాలని కోరగా కోర్టు ఆ పిటిషన్ ను కూడా తోసిపుచ్చింది. దోషులు గతంలో ఒక కేసులో ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారని తమకు కూడా అలాగే చేయాలని కోరగా కోర్టు పిటిషన్ ను తిరస్కరించింది. 
 
దోషుల తరపు న్యాయవాది ఎ పి సింగ్ దోషులను కలిసేందుకు వారి తలిదండ్రులకు 10 నిమిషాలు అనుమతి ఇవ్వాలని కోరగా కోర్టు అందుకు అంగీకరించలేదు. నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలుతో నిర్భయ ఆత్మ శాంతిస్తుందని ఆమె అన్నారు. ఉరి అమలు చేసే సమయంలో జైలు సూపరిండెంట్, డిప్యూటీ సూపరిండెంట్, మెడికల్ ఇంఛార్జీ ఆఫీసర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, జిల్లా మెజిస్ట్రేట్ సహా పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు. 
 
దోషులు రాత్రంతా మేల్కొనే ఉన్నారు. పోలీసులు అల్పాహారం సేవించాలని కోరినా వారు అందుకు అంగీకరించలేదు. నిన్న రాత్రి దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ జైలు అధికారులను దూషించాడని సమాచారం. ఉరిశిక్ష అమలుకు ముందు వినయ్ శర్మ విలపించినట్లు తెలుస్తోంది. దోషులకు ఉరి అమలు కావడంతో జైలు బయట సంబరాలు చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: