అఖిలాండకోటి బ్రహ్మనాయకుడు.. కలియుగ ప్రత్యక్ష దైవం వెలసిన తిరుపతిపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నిత్యం లక్షలాదిమంది భక్తులు.. వేలాది వాహనాలు.. గోవింద నామస్మరణలతో కిటకిటలాడే తిరుమల గిరులు ఎడారిని తలపిస్తున్నాయి. శ్రీవారి ఆలయం మూతపడడంతో తిరుపతి ఖాళీ అయ్యింది. 

 

ప్రపంచానికి వణికిస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయం కూడా మూసివేశారు అధికారులు. ఎన్నో వ్యయప్రయసాలతో దేశ, విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు నిత్యం నగరానికి వస్తుంటారు. అయితే ఆలయం మూతపడడంతో తిరుపతిలో కర్ఫ్యూ వాతావరణం కనపడుతోంది. నగరవాసులు సైతం వైరస్ భయంతో బయటకు రావట్లేదు. 

 

తిరుపతిలో నిత్యం 3వేల 650 బస్సుల్లో లక్షా 30వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏపీఎస్‌ ఆర్టీసీతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన 260 బస్సులు నగరం మీదుగా నడిచేవి. సగటున రోజుకు నాలుగువేల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు రైళ్లు, విమానాల ద్వారా నిత్యం 70 నుంచి 85 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. 40 శాతం మంది యాత్రికులు సొంత వాహనాలు, ట్యాక్సీల్లో వచ్చేవారు. ప్రస్తుతం ఆలయం మూసివేయడంతో భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో తిరునగరం బోసిపోయి కనిపిస్తోంది. 

 

తిరుపతి ప్రధానంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికుల మీద ఆధారపడిన నగరం. సంపన్నులకు సేవలందించే లగ్జరీ సూట్ల మొదలు పేదలు సర్దుకుని ఉండే చిన్న గదులు దాక అన్ని సదుపాయాలు తిరుపతిలో ఉన్నాయి. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా భక్తుల రాక తిరుపతికి పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు రూముల కోసం లాబియింగ్ చేసుకునే పరిస్థితుల నుంచి.. రూములు  కావాలా? అంటూ హోటల్స్ బోర్డులు పెట్టుకునే వరకూ వచ్చింది. 

 

ఇక నగరంలో తోపుడుబండ్ల దగ్గర నుంచి హైలెవల్‌ హోటళ్లు దాదాపు వెయ్యికి పైగా ఉన్నాయి. నగరవాసులతో పాటు, భక్తులకు ఆహారాన్ని అందించేవి. ఈ హోటల్స్‌ను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవనం సాగించేవి. అయితే ప్రస్తుతం భక్తులు రాకపోవడంతో గిరాకీ లేక హోటల్స్ మూసివేసే పరిస్థితి ఏర్పడింది. నగరవ్యాప్తంగా రోజుకు రెండు, మూడు కోట్లు వరకు బిజినెస్ జరుగుతుంది. కానీ లక్షల్లో కూడా బిజినెస్ జరగడం లేదని వ్యాపారస్తులు చెప్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: