తిరుమలలో అడవి జంతువులు సంచరిస్తున్నాయి. భక్తులకు అనుమతి లేకపోవడం.. ఘాట్‌ రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారడంతో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అటు వేసవి ప్రారంభం కావడంతో తాగునీటి కోసం జంతువులు ఆలయ పరిసరాల్లోకి వస్తున్నాయి. అటు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు అధికారులు హెచ్చరిస్తున్నారు. 

 

శ్రీవారి దర్శనాలకు అనుమతి లేకపోవడంతో తిరుమలగిరులు నిర్మానుణష్యంగా మారిపోయాయి. కేవలం టీటీడీ ఉద్యోగులు, కొందరు స్థానికులు మినహా ఎవరూ తిరుమలలోకి రావడం లేదు. ఆలయ ప్రాంగణంతో పాటు, ఘాట్ రోడ్లన్నీ బోసిపోయాయి. దీంతో తిరుమలలో అడవి జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. చిరుత పులుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 


శేషాచలం కొండల్లోని  తిరుమల ఆలయం పరిధిలో 2 వేల280 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో అనేక రకాల జంతువులు ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఏటా వేసవి కాలంలో వాటిలో కొన్ని జంతువులు అడవి నుంచి బయటకు వస్తుంటాయి. వేసవిలో ముఖ్యంగా తాగునీటి కోసం కొన్ని జంతువులు రోడ్డు మీదకు వస్తూ ఉంటాయి. ఆలయ పరిసరాల్లోనూ చాలా సార్లు పులులు, ఎలుగు వంటి జంతువులు సంచరించాయి. తిరుమల నడక దారిలో వెళ్లే భక్తులకు జంతువులు కనబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి భక్తుల రాకపోకలు నిలిచిపోవడం.. వాహనాల శబ్దాలు కూడా లేకపోవడంతో జంతువుల అలికిడి ముందుగానే ఉందని అభిప్రాయపడుతున్నారు. కల్యాణవేదిక, ముల్లగుంటలో చిరుత సంచారానికి సంబంధించిన  ఆనవాళ్లు ఉన్నాయి. నారాయణగిరి ఉద్యానవనం సమీపంలో ఎలుగుబంటి తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. 

 

ఇప్పటికే జంతువుల కోసం తాగు నీటి ఏర్పాట్లు చేశారు అటవీ అధికారులు. మళ్లీ భక్తుల రాకపోకలు మొదలయితే జంతువుల అలికిడి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండల్లో ప్రస్తుతం జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్న కారణంగా అలిపిరి సమీపంలోని వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.  


.

మరింత సమాచారం తెలుసుకోండి: