కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్ష మందికి ర్యాండమ్ టెస్టు నిర్వహించడంతో పాటు ఐదు సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో 12వేల హోటల్‌ గదులను అద్దెకు తీసుకుని క్వారెంటెయిన్ కేంద్రాలుగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 

 

ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. లక్ష మందికి ర్యాండమ్‌ టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి నిజాముద్దీన్, దిల్‌ షాద్ గార్డెన్‌లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 27వేల పీపీఈ కిట్లు ఢిల్లీకి తరలిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు దక్షిణకొరియా అవలంబించిన వైఖరిని అనుసరించాలని, ఇంటింటీకీ టెస్టులు జరపాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. 

 

కరోనా కట్టడి కోసం ఐదు సూత్రాల ప్రణాళిక అమలుపరుస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 5 టీ ప్లాన్‌లో ఐదు అంశాలున్నాయి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, టీమ్‌ వర్క్, ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ పేరుతో వీటిని అమలుచేయనున్నారు. టెస్టింగ్ కింద రాష్ట్రంలోని ఐదులక్షల మందికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రేసింగ్ సూత్రం ప్రకారం ఢిల్లీలో కరోనా లక్షణాలున్న వ్యక్తులను త్వరగా గుర్తించనున్నారు. ట్రీట్‌ మెంట్‌ ప్రకారం కరోనా పాజిటివ్ కేసులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించనున్నారు. టీమ్‌ వర్క్‌ కింద ప్రభుత్వ వ్యవస్థల మధ్య పూర్తిస్థాయి సమన్వయంతో ఒక జట్టుగా కరోనా వైరస్‌పై పోరాటం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదోది, చివరిదైన ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సూత్రం ప్రకారం ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కత్‌కు హాజరయిన వారిని త్వరగా గుర్తించి, వారు సన్నిహితంగా మెలిగిన ఇతరులను పర్యవేక్షించడం జరుగుతుంది. 

 

కరోనా వ్యాప్తి నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కేసుల తీవ్రత దృష్ట్యా 12వేల హోటల్‌ గదులను అద్దెకు తీసుకుని క్వారెంటెయిన్‌ కేంద్రాలుగా మారుస్తున్నామని తెలిపారు. ఎనిమిది వేలమందికి అత్యవసర చికిత్స అందించే ఏర్పాటుచేస్తున్నామని కేజ్రీవాల్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: