ఏదో ఒక విషయంలో వార్తల్లో వ్యక్తిగా మారుతుంటారు హిందూపురం శాసన సభ్యుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి పూర్తిగా మౌనంగా ఉంటున్న బాలయ్య తెలుగుదేశం పార్టీతో తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టేసి సినిమాల్లో బిజీగా ఉంటూ వస్తున్నారు. రాజధాని అమరావతి వ్యవహారంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన బాలయ్య ఇక ఆ తర్వాత ఏ కార్యక్రమంలోనూ పెద్దగా పాల్గొన్నట్టు కనిపించలేదు. ఇక మొదటి సారి హిందూపురం నుంచి గెలిచినప్పుడు బాలయ్య నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అంటూ ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా బాలయ్య పెద్దగా స్పందించినట్టు కనిపించలేదు. ఏకంగా బాలయ్య కనిపించడం లేదంటూ నియోజకవర్గ ప్రజలు పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారు.

 

IHG

 ఇది ఇలా ఉంటే రెండో సారి శాసనసభ్యుడిగా ఎన్నికైన బాలయ్య హిందూపురం నుంచి గెలవడం అసాధ్యం అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాలయ్య రెండోసారి హిందూపురం నుంచి గెలుపొందారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ అతలాకుతలమవుతోంది. ఈ దశలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగి తమ తమ ప్రాంతాల ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో భోజన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, మున్సిపల్, పంచాయతీ అధికారులను అప్రమత్తం చేస్తూ... ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యేలా చూడడం, రేషన్, ప్రభుత్వం పంపిణీ చేసి నగదు సక్రమంగా అందుతున్నాయా లేదా వంటి అన్ని విషయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం అవి చూసుకునే అవకాశం లేకుండా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. 

 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధన కఠినంగా అమలు అవుతున్న నేపథ్యంలో బాలయ్య హైదరాబాద్ కి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఆయన మాత్రం నియోజకవర్గం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా... సొంత నిధులను వెచ్చించి మరి కూరగాయలు, మరికొన్ని నిత్యావసరాలు తన అనుచరుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నప్పటికీ స్వయంగా నియోజకవర్గంలో కనిపించకపోవడంతో తీవ్రస్థాయిలో నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమకు ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే అంటూ నియోజకవర్గ ప్రజలు బాలయ్య తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఆపద సమయంలో బాలయ్య నిజంగా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా పెద్ద ఎదురుదెబ్బగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: