ప్రపంచంలోని అన్ని దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. నిపుణులు వైరస్ సోకిన వ్యక్తుల్లో 80 శాతం మంది ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటున్నారని చెబుతున్నారు. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లో ఏయే కణాలపై దాడులు చేస్తుందో శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్మనీలోని బెర్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు ఈఎంబీవో జర్నల్‌ తాజా సంచికలో వైరస్ ఊపిరితిత్తులను ఎలా ప్రభావితం చేస్తుందో పేర్కొన్నారు. 
 
తాము చేసిన పరిశోధనలు కరోనాకు సమర్థవంతమైన చికిత్స అందించేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌లోని రిసెప్టర్‌ శ్వాసకోశ నాళంలోని ప్రొజెనిటర్‌ కణాలపై దాడి చేస్తుందని వారు తెలిపారు. దాదాపు 12 మంది ఊపిరితిత్తుల కేన్సర్ రోగుల నమూనాలపై తాము ఈ పరిశోధనలు చేశామని పేర్కొన్నారు. వీరితో పాటు ఆరోగ్యవంతుల శ్వాసనాళంలో ఉండే కణాలపై కూడా పరిశోధనలు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
రోలాండ్‌ ఇలిస్‌ అనే శాస్త్రవేత్త తాము సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే కరోనా లేని వ్యక్తులకు సంబంధించిన కీలకమైన సమాచారం లభిస్తుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ప్రొజెనిటర్‌ కణాలు అతుక్కుంటున్నట్లు తాము గుర్తించామని తెలిపారు. సాధారణంగా కరోనా వైరస్ శరీరంలోని ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా వైరస్ శ్వాసకోశ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 
 
వైరస్ సోకిన వారిలో శ్వాసకోశంపై ఉండే పొర దెబ్బతిని దగ్గు మొదలై ఊపిరితిత్తుల దిగువన ఉన్న గాలి సంచులలోకి ద్రవాలు చేరుతాయి. అనంతరం శరీరంలో కార్బన్ డై యాక్సైడ్ లెవెల్స్ భారీగా పెరుగుతాయి. వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్యులు యాంటీ వైరల్, యాంటీ బయోటిక్స్ కలిపి ఉపయోగిస్తున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: