దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మొదట ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన మోదీ తాజాగా మే 3వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. కరోనా పై భారత యుద్ధం బలంగా సాగుతోందని మోదీ అన్నారు. దేశం కోసం ప్రజలు కష్టమైనా, నష్టమైనా నిలబడ్డారని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి చూస్తే మనం వెళుతున్న మార్గం సరైనదే అని అన్నారు. ప్రపంచదేశాలు నేడు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు. ప్రజల కష్టాలను ఎలా తగ్గించాలి... తీవ్రతను కనిష్టానికి ఎలా పరిమితం చేయాలనే దాని గురించి నిరంతరం చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. 
 
ఇకపై కూడా దేశవ్యాప్తంగా మరింత కఠినంగానే లాక్ డౌన్ అమలవుతుందని తెలిపారు. మే 3వ తేదీ వరకు ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలు రేపు విడుదల చేస్తామని ప్రకటన చేశారు. మరో 19 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి కరోనా హాట్ స్పాట్ పై దృష్టి పెట్టామని తెలిపారు. 
 
కరోనా నియంత్రణ కోసం మోదీ ఏడు సూత్రాలు చెప్పారు. పరిస్థితిని సమీక్షించి ఆంక్షల తొలగింపు గురించి ఆలోచిస్తామని అన్నారు. ఈ నెల 20 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలవుతుందని 20 తర్వాత లాక్ డౌన్ సడలింపుల గురించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ తప్పక ఉపయోగించాలని కోరారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోగలనని .... ఆరోగ్యం దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: