దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా కరోనా పంజా విసురుతూనే ఉంది. అయితే కేంద్రం తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే రేటు మాత్రం తగ్గిందని ప్రకటన చేసింది. 
 
దేశంలో లాక్ డౌక్ అమలులోకి రాక ముందు మూడు రోజులకు ఒకసారి కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని ప్రస్తుతం మన దేశంలో 6.2 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖాధికారి లవ్ అగర్వాల్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో, 19 రాష్ట్రాలలో కేసులు రెట్టింపయ్యే వేగం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని పేర్కొన్నారు. 
 
గతంతో పోలిస్తే పేషెంట్లు కోలుకునే రేటు కూడా భారీగా పెరిగిందని వ్యాఖ్యలు చేశారు. కరోనా మరణాలు, కోలుకుంటున్న రోగుల మధ్య నిష్పత్తి 80 :20గా ఉందని ఆరోగ్య శాఖ చెబుతోంది. నిన్నటివరకు దేశవ్యాప్తంగా 13,387 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 437 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా వేగంగా విజృంభిస్తూనే ఉంది. 
 
నిన్నటివరకు ఏపీలో 572 కరోనా కేసులు నమోదు కాగా తెలంగాణలో 766 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 628 మంది కరోనా భారీన పడ్డారు. ఏపీ, తెలంగాణ  రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: