ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వలస కార్మికులకు, నిర్మాణ రంగ కూలీలకు ఊరట కలగనుంది. ప్రభుత్వం రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర కంపెనీలు కార్యకలాపాలు కొనసాగించేలా అనుమతులు ఇచ్చిందని తెలుస్తోంది. ప్రభుత్వం లాక్ డౌన్ వల్ల మూతబడ్డ పారిశ్రామిక రంగాన్ని దశలవారీగా పునరుద్ధరించనుంది.
ఈరోజు నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా గాడిలో పెడుతూ ప్రజల చేతుల్లోకి నగదు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. రాష్ట్రంలో మండలాలను రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్ మండలాలలో ఎటువంటి పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతించరు.
గ్రీన్ జోన్లలో కఠినమైన నిబంధనలు పాటిస్తూ సంస్థలు కార్యకలాపాలు సాగించాల్సి ఉంటుంది. ఎక్కడైనా కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే ఆ ప్రాంతానికి అప్పటివరకు ఇచ్చిన అనుమతులు అన్నీ రద్దవుతాయి. రెడ్ జోన్లలో మాత్రం ప్రభుత్వం మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. జిల్లా స్థాయి కమిటీ ఏయే మండలాల్లో ఏ పరిశ్రమలు తెరవచ్చో నిర్ణయిస్తుంది.
అధికారులు పరిశ్రమల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల గురించి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో నిత్యావసర, అత్యవసర పరిధిలోకి వచ్చే పరిశ్రమలు తెరచుకోనున్నాయి. పాడి పరిశ్రమలు, ఆర్వో ప్లాంట్లు, బిస్కెట్లు, పండ్ల రసాల పరిశ్రమలు తెరచుకోనున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి