దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. దీంతో 2020 జనవరి 1 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలతో సహా 2021 జూలై 1 వరకు అదనపు డీఏను చెల్లించబోమని కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటన చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. 
 
కరోనా నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ కట్ చేయడంపై మన్మోహన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు మన్మోహన్ అధ్యక్షతన కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. మన్మోహన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తాను నిలబడతానని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను, సాయుధ దళాలను కరోనా కష్ట కాలంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని వ్యాఖ్యలు చేశారు. 
 
సాధారణంగా ప్రతి ఏటా రెండుసార్లు (జనవరి, జూలై)లో ద్రవ్యోల్బణం మేరకు ఉద్యోగుల కరువు భత్యాన్ని సవరిస్తారు. గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 శాతం డీఏ, 21 శాతం డీఆర్ పెంచింది. ఈ సంవత్సరం జనవరి నుంచి పెంపు వర్తిస్తుందని పేర్కొంది. అయితే తాజాగా డీఏ, డీఆర్ లను నిలిపివేస్తునన్నట్లు కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది. 
 
బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ బకాయిలను 2021 జులై తర్వాత విడుదల చేస్తారా...? లేదా...? చూడాల్సి ఉంది. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజు పెరుగుతోంది. ఇప్పటివరకు 24506 కరోనా కేసులు నమోదు కాగా 5064 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: