విశాఖలోని కంటైన్మెంట్ ఏరియాల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టిన పోలీసులు.. ఇప్పుడు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రెడ్ జోన్ల పరిధిలో ఆంక్షలను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఇండియన్ నేవీ సహకారం తీసుకుంటున్నారు. 

 

విశాఖ జిల్లాలో 8 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. జీవీఎంసీ జోన్ -4 పరిధిలో కేసుల ఉధృతి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 22 కేసులు నమోదవ్వగా.. అధికశాతం ఈ జోన్‌ పరిధిలోనే వెలుగుచూశాయి. దీంతో రెడ్ జోన్లను ప్రకటించిన యంత్రాంగం పలు కాలనీలను మూసివేసింది. రెడ్‌ జోన్ ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కాలనీల్లో జన సంచారం తగ్గలేదు. చిన్నచిన్న అవసరాల కోసం బయటకు వస్తున్నారు. కొందరు టైమ్ పాస్ కోసం రోడ్లు ఎక్కుతున్నారు. దీంతో ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు వినూత్న ప్రయోగానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. తూర్పు నావికాదళం సహకారంతో లాంగ్ రేంజ్ ఆకాస్టిక్ డివైజ్ లను ఏర్పాటు చేస్తున్నారు.

 

లాంగ్ రేంజ్ ఆకాస్టిక్ డివైజ్ పరిధి మూడు కిలోమీటర్లు ఉంటుంది. సముద్రంలో ఓడల మధ్య సమాచారం కోసం ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం రెడ్ జోన్లలో హెచ్చరికలను పోలీసు జీపుల నుంచే పంపిస్తున్నారు. అయితే ఏరియా ఎక్కువగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో సంకేతాలు చేరడం లేదు. దీంతో లాంగ్ రేంజ్ ఆకాస్టిక్ డివైజ్ వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

ఈ పైలెట్ ప్రాజెక్ట్ ఫలితాన్నిస్తే, అన్ని రెడ్ జోన్లలోను లాంగ్ రేంజ్ ఆకాస్టిక్ డివైజ్ లను ఏర్పాటు చేయాలనే ఆలోచన అధికారుల్లో ఉంది. ఇక కోవిడ్ నియంత్రణ విధుల్లో భాగంగా ఇప్పటికే పోలీసు శాఖకు నేవీ బృందాలు సేవలు అందిస్తున్నాయి. మొత్తానికి విశాఖలోకి ఎంటరైన కరోనాను తరిమికొట్టేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే నేవీ సహకారం తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: