దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగనున్నాయి. లాక్ డౌన్ వల్ల వేలాది పెళ్లిళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకున్నవారు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మే 3వ తేదీ తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తే పెళ్లిళ్లు చేసుకోవాలని కొందరు ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. 
 
అయితే మే 3వ తేదీ తరువాత పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేవారికి కొన్ని ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు సమచారం. ఏపీ ప్రభుత్వం మే 3వ తేదీ తరువాత పెళ్లిళ్లు చేసుకునేవారికి అధికారిక అనుమతి తప్పనిసరి చేసింది. ఏపీలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలకు జారీ చేసింది. పెళ్లికి పెళ్లికూతురు, పెళ్లికొడుకు తరపున పది మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. 
 
పెళ్లికి హాజరయ్యే వారి వివరాలను రెవిన్యూ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ కు పంపాల్సి ఉంటుంది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి జరిపిస్తే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు. పెళ్లిలో మాస్కులు, శానిటైజర్లను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాలలో నమోదైన కరోనా కేసులను బట్టి నిబంధనలలో మార్పులు చేయవచ్చు. మరోవైపు ఏపీలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో 7723 మందికి పరీక్షలు చేయగా 73 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఈరోజు ఉదయం వరకు 1332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ప్రస్తుతం 1014 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచటం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: