లాక్ డౌన్ కారణంగా వస్త్ర వ్యాపారం గడ్డుకాలం ఎదుర్కొంటోంది. 40 రోజులుగా  షాపులు బంద్ చేయడంతో  రెండో ముంబయి ప్రొద్దుటూరులో క్లాత్ మార్కెట్ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. దుకాణాల్లో పనిచేసే వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 

 

కరోనా లాక్ డౌన్ దెబ్బకు కడప జిల్లా ప్రొద్దుటూరులో వస్త్ర వ్యాపార రంగం కుదేలైంది. నిత్యం లక్షలాది మంది కొనుగోలుదార్లతో రద్దీగా ఉండే వస్త్ర వ్యాపార దుకాణాలు,  కరోనా కారణంగా మూతపడి కళావిహీనంగా మారాయి. 

 

వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా పేరున్న ప్రొద్దుటూరు పట్టణం ..ఇప్పుడు బోసిపోయింది. సాధారణ రోజుల్లో కూడా కోట్ల రూపాయల్లో వ్యాపారం జరిగే ప్రొద్దుటూరులోని బట్టల షాపులు, లాక్ డౌన్ కారణంగా మూతపడ్డాయి. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న కారణంగా ఇప్పటికే ప్రొద్దుటూరు పట్టణం రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. 

 

అసలే ఇది పెళ్లిళ్ల సీజన్. పైగా మాఘమాసం వచ్చిందంటే చాలు ప్రొద్దుటూరులోని వస్త్ర వ్యాపార సముదాయాలన్నీ పెళ్లి వస్త్రాల కొనుగోళ్లు చేసేవారితో కళకళలాడుతుంటాయి. కోట్లల్లో టర్నోవర్ ఉంటుంది.  అలాంటింది కరోనా వైరస్.. బట్టల వ్యాపారుల ఆశలపై నీళ్లు చల్లింది. ఇక బట్టల షాపుల్లో పని చేసే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. నలభై రోజులుగా ఎలాంటి పనిలేక నానా ఆగచాట్లు పడుతున్నారు. 

 

ప్రొద్దుటూరు క్లాత్ మార్కెట్ లో సుమారు ఆరుకు పైగా పెద్ద పెద్ద వస్త్ర వ్యాపార సముదాయాలున్నాయి. ఇందులో ముఖ్యంగా వస్త్రభారతి1,2, బాలాజీ క్లాత్ మార్కెట్, వివేకానంద క్లాత్ మార్కెట్, నందిని క్లాత్ మార్కెట్ లతో పాటు ఇతరత్రా సుమారు ఐదు వేల వరకు చిన్న చిన్న వస్త్ర వ్యాపారులున్నారు.  వస్త్ర వ్యాపారం పై ఆధారపడి పాతికవేల మందికిపైనే కుటుంబాలు జీవిస్తున్నాయి. పని ఉంటేనే వీరందరికీ కడుపునిండేది. 

 

అన్ని రంగాల్లానే , వస్త్ర వ్యాపార రంగానికి సాయమందించాలని వ్యాపారులు కోరుతున్నారు . కనీసం జీఎస్టీ, ట్యాక్స్ సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టర్నోవర్ ను బట్టి రాయితీలు ఇవ్వాలని, వడ్డీలేని రుణాలిచ్చి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

 

మూడు దశాబ్దాల ఘనచరిత్ర ఉన్న వస్త్ర భారతి, ప్రస్తుతం లాక్ డౌన్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూ లేనంతగా,  ఈ ఏడాది 50 శాతం వ్యాపారం కోల్పోయారు.  గతేడాది కూడా బట్టల కొనుగోళ్లు అంతంత మాత్రమే జరిగాయి. ఈ ఏడాదైనా సీజన్ లో కాస్తా కూస్తా లాభాలు వస్తాయనుకుంటే నిరాశే ఎదురైంది. ఊహించని విపత్తులా వచ్చిన కరోనా, తమ బతుకులను ఛిద్రం చేసిందని వస్త్ర వ్యాపారులు వాపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: