భారత్ పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 70,000కు చేరువలో ఉంది. ఇప్పటివరకు 20,915 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 2206 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో సీజనల్ వ్యాధులు ముసిరే సమయం దగ్గర పడుతోందని వైద్యులు చెబుతున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో గాంధీ ఆస్పత్రిని కరోనా రోగుల కోసమే కేటాయించగా.... 1500 పడకలతో గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రిని సిద్ధం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తే ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ వ్యాధులు జూన్ నుంచి నవంబర్ మధ్యలో విజృంభించే అవకాశం ఉంది. 
 
వానాకాలంలో మలేరియా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతాయి. ఆడ అనాఫిలస్ దోమ ద్వారా మలేరియా సోకుతుంది. మురుగునీటిలో ఎక్కువగా పెరిగే ఈ దోమలు ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడతాయి. వానాకాలంలో డెంగీ కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదవుతాయి. ఈడిన్ ఈజిఫ్టై దోమ డెంగీకి కారణమవుతుంది. ఎముకలు, కండరాల్లో నొప్పి, వాంతులు, వికారం లాంటి లక్షణాలు ఉండే డెంగీ వ్యాధి భారీన పడితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. 
 
వానాకాలంలో మలేరియా, డెంగీ విజృంభిస్తే అక్టోబర్ నెల నుంచి స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతాయి. హెచ్‌1.ఎన్1 వైరస్ స్వైన్ ఫ్లూకు కారణమవుతుంది. వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఈ వైరస్ ఇతరులకు సోకుతుంది. వైద్యులు సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత పాటించాలని... శానిటైజ్ చేసుకోవడం జీవితంలో భాగం కావాలని చెబుతున్నారు. బయటి ఆహారానికి దూరంగా ఉండాలని చల్లార్చి వడబోసిన నీటిని మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: