ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు అంతం లేదా.?  లక్షలాది ప్రాణాలు బలికావాల్సిందేనా..? ఇదే భయం ఇపుడు ప్రజలను పట్టుకుంది. అయితే ఆ మహమ్మారిని నియంత్రించేందుకు పరిశోధనలు కూడా వేగంగా జరుగుతున్నాయి. కరోనా సోకి ప్రాణాలతో బయటపడిన బాధితుల ప్లాస్మాను.. వైరస్ అటాక్ అయి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వాళ్లకు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరహా క్లినికల్ ట్రయల్స్ మన దేశంలో జోరుగా కొనసాగుతున్నాయి. 

 

సాధారణంగా మానవ శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినపుడు, దాన్ని తట్టుకునేందుకు యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయని సైన్స్ చెబుతోంది. ఇపుడు ఈ ఆధారాలతో పాటు ఇప్పటికే కొన్ని రోగాలకు జరుగుతున్న చికిత్సల ఫలితాలను బట్టి ,ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రాయల్స్ మొదలు పెట్టారు.  కరోనా నుంచి కోలుకున్న వాళ్ళ ప్లాస్మాను సేకరించి, వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్నవాళ్లకు ఎక్కిస్తారు. 

 

ప్లాస్మా థెరపీ తో కరోనాకు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ? ఇప్పటికే కరోనాతో కోలుకున్న వాళ్ళనుంచి 400 మిల్లీలీటర్ల ప్లాస్మాను  సేకరిస్తారు.. అందుకోసం ప్రత్యేక యంత్రాలు ఉంటాయి. ఒకరి నుంచి సేకరించిన ప్లాస్మా ను ఇద్దరికి ఇస్తారు. ప్లాస్మా సేకరణకు ముందు కరోనా నుంచి కోలుకున్న 18 సంవత్సరాలపైబడిన వ్యక్తులను గుర్తించి.. ప్రత్యేక టెస్టులు నిర్వహిస్తారు. 
 హీమోగ్లోబిన్, బీపీ, షుగర్, కిడ్నీ, లివర్ పని తీరులను పరిశీలిస్తారు. అంతే కాదు ప్లాస్మా ను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ రక్తం తో క్రాస్ మ్యాచ్ చేస్తారు. అన్నీ ఒకే అయితే ప్లాస్మా థెరఫీ మొదలు పెడతారు.

 

ఇప్పటికే తెలంగాణాలో గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా తో 800ల మంది కోలుకున్నారు. అయితే ముందుగా ప్లాస్మా ఇస్తుంది మాత్రం విదేశాల నుంచి వచ్చి కరోనా సోకి కోలుకున్న యువకులు. గాంధీలో కోలుకున్న మొదటి 15 మంది నుంచి ముందుగా ప్లాస్మా సేకరిస్తున్నారు.  ఒకసారి ప్లాస్మా సేకరిస్తే ఆరు నెలల వరకు నిల్వ ఉంచవచ్చంటున్నారు డాక్టర్లు.

 

1918లో ఫ్లూ జ్వరం మహమ్మారిలా వ్యాపించినప్పుడు దానికి ఆధునిక వైద్యం అందుబాటుకు రాలేదు. వైద్యులు అప్పుడు కోలుకున్న రోగుల ప్లాస్మాను వ్యాధిగ్రస్తుల రక్తంలోకి ఎక్కించి నయం చేశారు. 2002లో సార్స్‌ వచ్చినప్పుడు.. 2014లో ఎబోలా వచ్చినప్పుడు కూడా ఇదే తరహా ట్రీట్మెంట్‌ చేశారు. ఇప్పుడు కోవిడ్ 19 వైరస్‌కు కూడా ప్లాస్మా థెరపీ సమర్థంగా పనిచేస్తుందని నమ్ముతున్నారు.. ఇప్పటికే   చైనా, దక్షిణ కోరియాలో చికిత్స చేసిన పేషెంట్లకు నయం కాగా.. భారీ స్థాయిలో ప్లాస్మా ను వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోనూ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. 

 

ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న ప్లాస్మా ట్రాయల్స్ ను ఐసీఎమ్ ఆర్ పర్యవేక్షిస్తోంది. అంతేకాదు రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో ఉన్న కరోనా పేషేంట్ల లో ఎవరి పై ప్లాస్మా ప్రయోగాలు చేయాలో కూడా ఐసీఎమ్మార్ ఫైనల్ చేస్తుంది.. ఏదేమైనా ప్లాస్మా ట్రాయల్స్ లో మంచి రిజల్ట్స్ వస్తే.. కరోనా ట్రీట్మెంట్ లో ఓ అడుగు ముందుకు పడనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: