ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని ప్రకటన చేసింది. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు పాస్‌లు లేకుండా తిరగొచ్చని చెబుతోంది. పోలీస్ శాఖ నుంచి నిన్న ఈ మేరకు ప్రకటన విడుదలైంది. పొరుగు జిల్లాలకు వెళ్లేందుకు ఎక్కువమంది సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తూ ఉండటంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
అయితే పాస్‌లు లేకపోయినా కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయని పోలీస్ శాఖ చెబుతోంది. కార్లలో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించాలని... మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఏవైనా అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. 
 
కంటైన్మెంట్ ప్రాంతాల్లో, రెడ్ జోన్లలోని ప్రాంతాల్లో నిబంధనలు కొనసాగుతాయని... ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుందని ఆ తర్వాత ఎవరైనా బయటకు వస్తే చర్యలు తప్పవని చెబుతున్నారు. ఏపీకి రావాలన్నా, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా అనుమతి తప్పనిసరి అని వారు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణలాంటి అత్యవసర ప్రయాణాలకు పాస్‌లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. 
 
ఆన్ లైన్ లో ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సమర్పించిన వివరాలను పోలీసులు ఆమోదిస్తే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్‌ను పంపిస్తామని చెబుతున్నారు. పాస్‌ల కోసం దరఖాస్తు చేయడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రయాణించేవారి వివరాలు. ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్, మెయిల్ ఐడీ, అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు, మొబైల్ నంబర్, వాహనానికి సంబంధించిన వివరాలు తప్పనిసరి అని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: