ఆర్ధిక ప్యాకేజీల్లో రిక్తహస్తంతో వ్యవస్థ మీద వలసకూలీలకు విశ్వాసం సన్నగిల్లింది. లాక్‌డౌన్ సమయంలో వలసకూలీలపై కేంద్రం వ్యవహరించిన తీరు దేశంలో వలసలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. పారిశ్రామిక, భవన నిర్మాణ రంగాల్లో కీలకమైన వలసకూలీల పాత్ర.. తిరిగి వాటిని ఎంతవరకూ పరుగులు పెడుతుందనేది కాలమే నిర్ణయించనుంది. 

 

లాక్‌డౌన్ ప్రభావం నుంచి ఆర్ధిక సంస్థల పునర్జీవానికి ఇప్పటికే కేంద్రం రెండు ప్యాకేజీలను ప్రకటించింది. అందులో వలదారులతో పాటు విదేశాల నుంచి తిరిగొస్తున్న వారి పునేరేకీకరణకు తగిన పథకాలేవి అందులో లేవు. దృష్టి పెట్టామని చెప్పడం తప్ప వారి గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఒక్క కేరళ మినహా మరే రాష్ట్రం దానిపై ఆలోచనే చేయడం లేదు. ఈ ప్రభావంతో వలసదారులు స్వల్పకాలంలో నష్టపోతారు తప్పితే.. దీర్ఘకాలంలో వాళ్లు లాభపడతారంటున్నారు నిపుణులు.

 

 ఒక్క ముంబై మాత్రమే కాదు, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోని ఆర్ధిక వ్యవస్థల్లో వలసదారుల వాటా 30 నుంచి 40 శాతం ఉంటుంది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, నిర్మాణాలు, భారీ కట్టడాలు.. ఇలా ప్రతీ చోట వలసదారుల పాత్ర చాలా కీలకం. వీరు లేకుండా పనులేవీ ముందుకు సాగవు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పరిశ్రమలన్ని తెరిచారు. కానీ, వలసదారులు లేక ఉత్పిత్తి మందగించింది. దీర్ఘకాలంలో వలసదారుల పాత్ర ప్రభుత్వం గుర్తించకపోవడమే ఇందుకు కారణం.

 

వాస్తవానికి మన దేశంలో 50 కోట్ల మంది వరకు భారతీయులు అంతర్గత వలసదారులుగా ఉన్నారు. వీరంతా తాము జన్మించిన ప్రదేశాలకు దూరంగా బ్రతుకుతూ.. ఉపాధి పొందుతున్నారు. వీరిలో 15 కోట్ల మంది సాధారణ కూలీలుండగా.. మిగిలిన వారు వివిధ రంగాల్లో చేయితిరిగిన అనుభవం, నైపుణ్యం కలిగి ఉన్నారు. అయితే, వారికి పనిచేసే ప్రాంతంలో స్థిర నివాసం ఉండదు. కుటుంబాలు, ఆస్తులన్నీ సొంత ప్రాంతాల్లోనే ఉంటాయి. వీరంతా ఆకస్మిక లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 

 

రాత్రికి రాత్రే ఉపాధి కోల్పోయిన వీరంతా.. అంత వరకు పని చేసిన పనికి కూడా వేతనం పొందలేకపోయారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనే కాలం గడిపారు. ఆ తర్వాత లాక్‌డౌన్ పొడిగించుకుంటూ పోవడంతో భవిష్యత్ మీద భయంతో ఉన్న చోట ఉండలేక సొంతూళ్లకు పయనమయ్యారు. వందలు, వేల కిలోమీటర్లు కాలినడకనే బయలుదేరారు. మార్గమధ్యలోనే కొందరు మరణించగా.. మరికొందరు ఆకలితో అలమటిస్తూ సొంతగ్రామాలకు చేరుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న వారిని మాత్రం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ పేరుతో దేశంలోకి తీసుకువస్తోంది.

 

వాస్తవానికి ప్రపంచంలో వలస ఉద్యోగుల రాబడితో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. విదేశాల్లో పనిచేస్తున్న వీరు దేశానికి ఏటా రెండు బిలియన్ డాలర్లకు పైన విదేశీమారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారు. ఇలా దేశానికి వస్తున్న రాబడిలో కేరళకు 19 శాతం వాటా వస్తుంటే.. మహారాష్ట్ర మాత్రం 15 శాతం సంపాదిస్తోంది. వీరిలో అత్యధికులు తిరిగి వారు పనిచేస్తున్న దేశాలకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అంతర్గత వలసదారుల పరిస్థితి అయితే, మరింత దయనీయంగా ఉంది.
సుధీర్ఘ ప్రాంతాలకు వెళ్లి కష్టపడడం కంటే.. చిన్న చిన్న ఉపాధి చేసుకుని బ్రతకొచ్చనే భావనకు వచ్చారు. దీంతో వ్యవస్థలు పునఃప్రారంభమైనప్పటికీ.. వలసదార్లు లేకుండా అవి పరుగులు పెడతాయనేది మాత్రం తప్పేనంటున్నారు విశ్లేషకులు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: