కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయస్సుపెంపుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నిన్న మహిళలు ఏ వయసులో తల్లి అయితే ఆరోగ్యకరమో అన్న అంశాన్ని అధ్యయనం చేయడానికి టాస్క్ ఫోర్స్ ను నియమించింది. ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు కాగా ఈ వయస్సును ఎంతకు పెంచాలనే అంశం గురించి టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేయనుంది. 
 
ఈ టాస్క్ ఫోర్స్ లో 10 మంది సభ్యులు ఉన్నారు. జయా జైట్లీ అధ్యక్షతన ఏర్పడిన ఈ టాస్క్ ఫోర్స్ లో ఢిల్లీకి చెందిన నజ్మా అఖ్తర్‌, మహారాష్ట్రకు చెందిన వసుధా కామత్‌, గుజరాత్‌కు చెందిన దీప్తి షా ఇతరులు సభ్యులుగా ఉన్నారు. మహిళాశిశు సంక్షేమం, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, న్యాయశాఖ, నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌, కేంద్ర వైద్య-ఆరోగ్య శాఖ కార్యదర్శులు ఈ టాస్క్ ఫోర్స్ లో ఉన్నారు. 
 
జులై 31వ తేదీ నాటికి ఈ టాస్క్ ఫోర్స్ నివేదికను అందజేయనుంది. బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. శారదా చట్టం-1929లోని నిబంధనలలో మార్పులు చేర్పులు చేసి మహిళల వివాహ వయస్సును 15 నుంచి 18 ఏళ్లకు పెంచారు. దేశంలో ప్రస్తుతం మహిళల ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చింది. దేశంలో గత రెండు దశాబ్దాలలో మాతృ మరణాలు భారీగా తగ్గాయి. 
 
దేశంలో ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడటం, హాస్పిటల్స్‌లో కాన్పులు, పౌష్ఠికాహారం స్థాయి పెరగడం మాతృ మరణాల సంఖ్య తగ్గడానికి కారణమైంది. దేశంలో అన్ని రాష్ట్రాలు మాతృ మరణాలు తగ్గించడంలో పురోగతి సాధించినా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఇప్పటికీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేంద్రం మహిళల కనీస వివాహ వయస్సును మూడు లేదా నాలుగు సంవత్సరాలు పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: