దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అదుపు చేయలేనంత స్థాయిలో తీవ్రతరమైంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా ఈ తరహాలో కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాలు కరోనా ప్రభావానికి అల్లాడుతున్నాయి. ఎన్ని రకాల నిబంధనలు విధించి కఠినతరం గా వాటిని అమలు చేస్తున్నా, కేసులు అదుపులోకి రాకపోగా, నిత్యం వేలాది కొత్త కేసులు నమోదు అవుతూ ఆయా రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా మరోసారి  లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం జరుగుతున్నా, కేంద్రం ఈ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్టు గానే  కొన్ని రాష్ట్రాలు పసిగట్టాయి. దీంతో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు సొంతంగానే తమ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో కొన్ని జిల్లాల్లో కఠినంగా లాక్ డౌన్ అమల్లోకి తీసుకువచ్చారు.

IHG


 ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు పూర్తిగా అక్కడ లాక్ డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా చెన్నై తో పాటు నాలుగు జిల్లాల్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో, అక్కడ లాక్ డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలో లాక్ డౌన్ విధించాలని సోమవారం సమావేశమైన తమిళనాడు కేబినెట్ నిర్ణయించింది. కరోనా వైరస్ ను పూర్తిగా అదుపు చేసేందుకు చెన్నైలో లాక్ డౌన్ సడలింపులు మళ్లీ కఠినతరం చేయాలని ఇప్పటికే నిపుణుల కమిటీ సూచించింది.

 


 రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1774 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కేసుల సంఖ్య 44 , 661 కి చేరింది. ఇప్పటివరకు కరోనా కారణంగా 435 మంది రోగులు మరణించగా, 24 ,500 మంది కోలుకున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో ఉదయం 06 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్టోర్స్, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంకులు, మొబైల్ మార్కెట్లు తెరిచి ఉంచుతారు. అలాగే ప్రజలు తమ ఇళ్ల నుంచి రెండు కిలో మీటర్ల పరిధిలో మాత్రమే తమ సొంత వాహనాలపై ప్రయాణించాల్సి ఉంటుంది. అత్యవసర సర్వీసులు, ట్రావెల్స్, వైద్యపరమైన విషయాలకు  పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా 33 శాతం ఉద్యోగులతో పనిచేయాలని క్యాబినెట్ పేర్కొంది.

 


ఈ తరహా నిబంధనలు కరోనా ప్రభావంతో అల్లాడుతున్న మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండడంతో మరి కొన్ని రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: