ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తుండగా కొన్ని వ్యాక్సిన్ లు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా జర్మనీలో రూపుదిద్దుకున్న కరోనా వ్యాక్సిన్ వైరస్​ను కట్టడి చేయడంలో అద్భుత ఫలితాలిస్తోంది. 
 
ప్రస్తుతం నాలుగో స్టేజ్​ తొలిదశలో ఉన్న వ్యాక్సిన్ మనుషులపై సత్ఫలితాలు ఇస్తోంది. జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​, అమెరికాకు చెందిన ఫిజెర్ కంపెనీలు బుధవారం ఈ మేరకు ప్రకటన చేశాయి. దీంతో మనుషులపై టెస్టులు జరుపుతున్న వ్యాక్సిన్ల సంఖ్య 17కి చేరింది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టామని ఇరుసంస్థలు చేసిన ప్రకటన వల్ల రెండు కంపెనీల షేర్లు ఎగసిపడ్డాయి. 
 
బీఎన్​టీ162బీ1 అనే మందును 24 మంది వాలంటీర్లకు ఇవ్వగా 28 రోజుల తర్వాత వారి శరీరంలో కరోనా వైరస్ యాంటీబాడీలు తయారయ్యాయని బయోఎన్​టెక్​ తెలిపింది. మూడు వారాల్లో రెండు డోసుల చొప్పున ఇంజెక్షన్​ ఇచ్చామని.... రెండో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి నలుగురిలో ముగ్గురికి స్వల్పంగా జ్వరం వచ్చిందని వాళ్లు తెలిపారు. వ్యాక్సిన్​ మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. 
 
రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో ట్రయల్స్​ నిర్వహిస్తామని సంస్థ పేర్కొంది. అన్ని అనుమతులు వస్తే జులై​ చివరకు అమెరికా, యూరప్​లోని 30 వేల ఆరోగ్యమంతమైన వ్యక్తులపై బయోఎన్​టెక్​, ఫిజర్​ వ్యాక్సిన్​ను పరీక్షించే అవకాశం ఉందని తెలిపారు. మార్కెట్​ అనుమతులు జారీ చేస్తే, 2020 డిసెంబర్​ నాటికి ఒక కోటి వ్యాక్సిన్లు, 2021 చివరకు 120 కోట్ల వ్యాక్సిన్లను కంపెనీ రెడీ చేస్తుందని సమాచారం. అయితే వ్యాక్సిన్ పూర్తిస్థాయి ఫలితాలు తెలిస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుందో లేదో తెలుస్తుందని అప్పటివరకు వైరస్ కు భయపడాల్సిందేనని వాళ్లు చెబుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: