ఏమనుకుంటున్నాడు ఈ జగన్ ! ఇష్టమొచ్చినట్టుగా పరిపాలన చేద్దామంటే చూస్తూ ఊరుకుంటామా ? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈయనగారి సంగతేంటో ప్రజల్లోనే తేల్చుకుంటాం అన్నట్టుగా చంద్రబాబు పదే పదే పార్టీ శ్రేణులకు చెబుతున్న మాట. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రస్తుతం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపైన, జగన్ నిర్ణయాలను వ్యతిరేకించాలని పిలుపు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా, కుదిరితే ధర్నాలు, ఆందోళనలు, లేకపోతే సోషల్ మీడియాలో పోరాటం చేసే విధంగా ఎప్పటికప్పుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. ఏదో ఒక అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
కానీ పార్టీ కార్యకర్తల్లో మాత్రం ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదు. కేవలం కార్యకర్తలే కాదు, ద్వితీయ శ్రేణి నాయకులు, జిల్లా నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినవారు, ఇలా ఎవరూ ఉత్సాహంగా ముందుకు వచ్చే పరిస్థితి ఆ పార్టీలో కనిపించడం లేదు. ఒకవేళ ఎవరైనా యాక్టివ్ గా ఉండమన్న, వారిపైన ప్రభుత్వం టార్గెట్ పెట్టి వేధిస్తుంది అనే భయంతో వెనకడుగు వేసే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో ఉండడం, 2024 నాటికైనా ఆక్టివ్ గా ఉంటుందా అనే భరోసా లేకపోవడం, నాయకత్వం లోపం, తదితర కారణాలతో ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు.
ఈ వ్యవహారాలు చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. గతంలో నిర్వహించిన ఇసుక దీక్ష మొదలు, ఏ వ్యవహారాల్లోనూ పెద్దగా కార్యకర్తలు పాల్గొన్న దాఖలాలు కనిపించడం లేదు. గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుండడంతో, ఏం చేయాలనే విషయంపై చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పదవుల్లో మార్పు చేర్పులు చేసి, కొత్త కమిటీలను ప్రకటించి, పార్టీపై అంకితభావం, ఉత్సాహం ఉన్న నాయకులకు మాత్రమే కొత్త కమిటీలో చోటు ఇవ్వాలనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు త్వరలోనే పార్టీ కమిటీల నియామకం చేపట్టే విధంగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఆ పార్టీలోని కీలక నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి