భారత్ పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు, భౌతిక దూరం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇదే సమయంలో వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న కీలక విషయాలు ప్రజల్లో వైరస్ భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. తాజాగా దద్దుర్లు, దురద, చర్మం ఎర్రబారడం కూడా కరోనా కావచ్చని వైద్య నిపుణులు కీలక ప్రకటన చేశారు. కరోనా అసలు లక్షణాలు కనపడటానికి ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయని వాళ్లు చెబుతున్నారు. కరోనా భారీన పడిన 20 శాతం రోగుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.
వైద్యపరిభాషలో చర్మం ఎర్రబారినట్లు కనిపించడాన్ని ఎరిథమెరిస్ అంటారని ఇటలీ, స్పానిష్ దేశాల్లోని దాదాపు 70 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు ఎవరిలోనైనా దద్దుర్లు, దురదలు వస్తే కొన్ని రోజుల తర్వాత కరోనా లక్షణాలేమైనా కనిపిస్తాయేమో చూడాలని సూచిస్తున్నారు. చికెన్ పాక్స్ సోకిన వాళ్లలో కనిపించే లక్షణాలే వీళ్లలో కూడా కనిపించడం గమనార్హం.
మరికొందరు కరోనా రోగుల్లో మాత్రం కాళ్ల వేళ్ల చివర ఎర్రగా కనిపించడాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మహిళల్లో ఎక్కువగా ఈ లక్షణాన్ని గమనించామని... కువైట్ కు చెందిన కొంతమంది రోగుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొందరు కరోనా రోగుల్లో చర్మం కింద రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.... మరికొందరిలో చర్మం కింద రక్తపు మచ్చలు కనిపిస్తున్నాయని... చర్మానికి సంబంధించి సమస్యలు వస్తే ఐసోలేషన్ లో ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి