ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత భారీగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 4,944 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక్కరోజే దాదాపు 5,000 కేసులు నమోదు కావడంతో ప్రజలతో పాటు అధికారులు సైతం టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరినుంచి వైరస్ సోకుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
తగిన జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ భారీన పడుతున్నామని పలువురు చెబుతున్నారు. అయితే వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో చిత్తూరులో కరోనా చికిత్స పొందుతున్న ఒక బాధితుడు నిన్న పరీక్ష రాశాడు. 2019లో జిల్లా క్షయ విభాగంలోని ఆర్.ఎన్.టీ.పీ.సీ కింద కొన్ని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ గతంలోనే పూర్తైనా కొన్ని కారణాల వల్ల నోటిఫికేషన్ ను రద్దు చేశారు.
అధికారులు నోటిఫికేషన్ లో పలు మార్పులు చేర్పులు చేసి మరోసారి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు నిన్న పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని క్షయ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిన పని చేసే ఒక ఉద్యోగి ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ వ్యక్తికి ప్రస్తుతం చిత్తూరు కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అయినా ఆ వ్యక్తిని అధికారులు పరీక్షకు అనుమతించారు.
కరోనాకు చికిత్స పొందుతున్న వ్యక్తిని పరీక్షకు అనుమతించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రూనాట్ పరీక్షలో నెగిటివ్ రావడంతో డీ.హెచ్.ఎం.వో. అనుమతి తీసుకుని పరీక్షకు అనుమతించామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చిత్తూరు డీఈవో కార్యాలయంలో కరోనా రెండు కేసులు నమోదు కావడంతో అధికారులు నేడు మిగిలిన సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి