రోజూ.. కరోనా కేసులు, లెక్కల గురించి వినీ వినీ... అందరిలో అదో భయం పట్టుకుంటుంది. కానీ.. ఇన్నాళ్లకు మనదేశంలో కరోనాకు సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్  వచ్చింది. దేశంలో కరోనా  బాధితుల రికవరీ రేటు పెరుగుతోంది. నిజంగా ఇది గుడ్‌న్యూసే..! ఒక్కరోజే కొత్తగా రికార్డు స్థాయిలో పేషెంట్లు వైరస్‌ను జయించి డిశ్చార్జయ్యారు.

 

దేశంలో కరోనా కేసుల పెరుగుతున్నా... ఎక్కువ మంది వైరస్‌ నుంచి కోలుకుంటున్నారు. రికార్డుస్థాయిలో ఒక్క రోజే కొత్తగా 28 వేల 472 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా ప్రభావం ప్రారంభమయ్యాక.. ఒక్క రోజే ఇంత భారీ సంఖ్యలో కోలుకున్న బాధితులు డిశ్చార్జ్‌ అవ్వడం ఇదే తొలిసారి.  ప్రస్తుతం రికవరీ రేటు 63 శాతానికి పైగా ఉంది.  

 

మరోవైపు దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37 వేల 724 కేసులు రికార్డయ్యాయ్‌. మరో 648 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య 11 లక్షల 92 వేల 915కి చేరింది. 28 వేల 732 మంది వైరస్‌తో చనిపోయారు. కొత్త లెక్కలతో భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక మరణాలు చోటు చేసుకున్న దేశాల లిస్ట్‌లోకి 7 వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు ఏడో స్థానంలో స్పెయిన్‌ ఉంది. కరోనా కేసుల్లో మాత్రం భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.  దేశంలో మొత్తం బాధితుల్లో 7 లక్షల 53 వేల 50 మంది వైరస్‌ను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 4 లక్షల 11 వేల 133 యాక్టివ్‌ కేసులున్నాయ్‌. గడిచిన 24 గంటల్లో 3 లక్షల 43 వేల 243 మందికి పరీక్షలు నిర్వహించారు.  మొత్తం కోటీ 47 లక్షల 24 వేల 546 మందికి కొవిడ్‌ టెస్టులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 

 

మొదటి నుంచి కరోనాకు కేంద్ర బిందువుగా మారిపోయిన మహారాష్ట్రలో పరిస్థితులు రోజురోజుకి ఆందోళనకరంగా మారుతున్నాయి. ప్రతి రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. ఇక తమిళనాడు, కర్ణాటకలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. రోజువారీ కేసులు 5వేలకు చేరువలో ఉన్నాయి. ప్రపంచ కరోనా జాబితాలో మూడో స్థానంలో ఉన్న భారత్‌... కొత్త కేసుల నమోదులో మాత్రం సెకండ్ ప్లేస్‌లో ఉంది. కొత్త కేసుల నమోదులో అమెరికా భారత్ పోటీపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: