తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కామారెడ్డిలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనాకు సీజనల్ వ్యాధులు తోడవుతున్నాయని అన్నారు. జిల్లాల వారీగా ఉండే సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమీక్ష చేపడుతున్నామని అన్నారు. ప్రపంచంలో భగవంతుని తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించున్నది వైద్యుడు మాత్రమేనని కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా అప్రమత్తమైందని తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోయిందని... కరోనా సోకిన వారిలో లక్షణాలు కనిపించడం లేదని... రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వాళ్లలో 81 శాతం మందికి కరోనా సోకినట్టు కూడా తెలియదని... పరీక్షల ద్వారా మాత్రమే వాళ్లకు వైరస్ భారీన పడినట్లు తెలిసిందని అన్నారు. కరోనా భారీన పడిన వారికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలకు కూడా మించదని తెలిపారు.
రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు చేయడంలో ఆలస్యం కావడం వాస్తవమేనని.... ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ర్యాపిడ్ టెస్టుల సంఖ్యను పెంచామని.... లక్షణాలు లేని వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. హోం ఐసోలేషన్ కు పంపే ముందు ఇంట్లో ఉన్నవాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని చెప్పారు. ఈ నెల 31వ తేదీలోపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
ప్రజల్లో కరోనా వైరస్ వల్ల భయం నెలకొందని... వాళ్లకు భరోసా కల్పించడం అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో కరోనా విషయంలో కొందరు రాజకీయం చేస్తున్నారని... చనిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులు కూడా ముట్టుకునే పరిస్థితి లేదని... ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యులు పని చేస్తున్నా వారిని అభినందించకుండా హేళన చేసి మాట్లాడుతున్నారని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి