కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రుణాల చెల్లింపులపై మారటోరియం లేదా రుణాల పునర్వ్యవస్థీకరణ పొడిగింపుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. నిన్న వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్మల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆతిథ్య రంగం అవసరాలను అర్థం చేసుకున్నామని.... మారటోరియం పొడిగింపుపై సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.
కరోనా వైరస్ ధాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో ఆర్బీఐ ఆరు నెలల పాటు మారటోరియం వెసులుబాటును కల్పించింది. ఈ నెల 31తో వెసులుబాటు ముగియనుంది. తొలుత మార్చి-మే నెలలకే ఆర్బీఐ మారటోరియం అవకాశం ఇచ్చింది. అనంతరం కరోనా వైరస్ విజృంభణ వల్ల మరో మూడు నెలలు వెసులుబాటును పొడిగించింది. నిర్మలా సీతారామన్ ఇప్పటికే దీనికి సంబంధించి పరోక్షంగా సంకేతాలు ఇవ్వడంతో మారటోరియం పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ మాత్రం మారటోరియం గడువును పొడిగించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎస్బీఐ సహా పలు బ్యాంకర్లు ఆగస్టు 31 తర్వాత మారటోరియంను కొనసాగించనక్కర్లేదని అభిప్రాయపడుతున్నాయని అన్నారు. ఆర్బీఐ గవర్నర్ కు హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఆగస్టు తర్వాత మారటోరియంను పొడిగించవద్దని విజ్ఞప్తి చేసింది. దీపక్ పరేఖ్ రుణాలను చెల్లించే స్థోమత ఉన్నవాళ్లు మారటోరియం సాకుతో చెల్లించడం లేదని... ఈ పరిణామం బ్యాంకింగ్ వ్యవస్థకే ప్రమాదంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి