లీడ్ఇండియా పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టే చంద్రబాల మీడియా, రాజకీయ గేమ్ చట్రంలో నలిగిపోతోంది. సంచలనాలకు మారుపేరైన సీబీఐ జెడి లక్ష్మీనారాయణ స్నేహితురాలు కావడం కూడా చంద్రబాలకు చికాకులు తెచ్చిపెట్టింది. కర్నూలు జిల్లా శ్రీశైలం ఇరిగేషన్ శాఖలో చంద్రబాల, లక్ష్మీనారాయణ తండ్రులు కలిసిపనిచేశారు. ఈక్రమంలో ఇరువురు ఇరుగుపొరుగు వారు కావడం విశేషం. కాగా తాజాగా జెడి లక్ష్మీనారాయణ యువనేత జగన్ కేసులో కీలక అధికారిగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. దీంతో కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సదరు యువనేత అనుచరులు జెడి లక్ష్మీనారాయణ సెల్ ఫోను డాటాను సేకరించింది. జెడి ఫోన్ నుంచి కాల్స్ వెళ్ళిన వారందరూ యువనేత కేసులో కుట్రదారులుగా అభివర్ణించింది. ఇందులో భాగంగా మీడియాకు చెందిన క్రైం రిపోర్టర్లు వైఎస్ఆర్పిసి నేతలపై మండిపడ్డారు. విధులలో భాగంగా తాము చాలా మందికి ఫోన్లు చేస్తుంటామని, ఈ నేపథ్యంలో యువనేత అక్రమాస్తుల కేసులో నిందితుడైన విజయసాయి రెడ్డికి సైతం పలుమార్లు ఫోన్లు చేశామని క్రైం రిపోర్టర్లు మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ఇక్కడ మీడియాకు సంబంధంలేని పేరు వినిపించింది. ఆమె ఎవరో కాదు జెడి స్నేహితురాలు చంద్రబాల. కాగా చంద్రబాలకు తరచూ జెడి లక్ష్మీనారాయణ ఫోన్లు చేయడాన్ని వైఎస్ఆర్పీసి తప్పుబట్టింది. అంతటితో ఆగక సదరు చంద్రబాల ఫోన్ నుంచి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరికి కాల్స్ వెళ్ళాయని వైఎస్ఆర్పీసి నిగ్గదీసింది. ఇదిలా ఉండగా గత దీర్ఘకాలంగా యువనేత వర్గానికి, వేమూరి రాధాకృష్ణకు మధ్య మీడియా వార్ జరుగుతున్న విషయం విధితమే. ఈ కారణంగా జెడి లక్ష్మీనారాయణ యువనేత కేసుకు సంబంధించిన సమాచారాన్ని చంద్రబాలకు అందించారని, ఆపై ఆమె వేమూరికి కోవర్టుగా పనిచేసిందన్నదే వైఎస్ఆర్పీసి ప్రధాన ఆరోపణ. కాగా తాను లీడ్ ఇండియా పేరిట యువతకు చేయూత, సన్మర్గంలో ఉంచే సేవా కార్యక్రమాలు చేస్తుంటానని, ఇందుకు సంబంధించి తాను మీడియాను తరచూ సంప్రదిస్తుంటానని చంద్రబాల చెప్పే మాటలు విశ్వసించే విధంగా లేవని యువనేత వర్గీయులు విమర్శిస్తున్నారు. అంతటితో ఆగక ఓ సీబీఐ అధికారి హోదాలో ఉన్న వ్యక్తి పాటించాల్సిన పద్దతులను జెడి పాటించడం లేదని, కేవలం కుట్రపూరితంగా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నాడని, జగన్ వ్యతిరేకమీడియా సంస్థలకు సమాచారం చేరవేడడమే ఇందుకు సాక్షమని వైఎస్ఆర్పీసి నేతలు వాదిస్తున్నారు. ఏది ఏమైనా యువనేత రాజకీయంలో, రాష్ర్టంలో రాజ్యమేలుతున్న మీడియా మాఫియాలో చంద్రబాల పావుగా మారిందని మాత్రం ఖచ్చితంగా తేల్చిచప్పవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: