అమెరికాలో రాజకీయ వేడి రాజుకుంది. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ట్రంప్ పై విమర్శల వాడి పెంచారు. అటు ట్రంప్ కూడా వీటిని తిప్పికొడుతున్నారు. ట్రంప్ విఫల అధ్యక్షుడని డెమోక్రాట్లు అంటుంటే.. వారి వైఫల్యాల వల్లే తాను అధ్యక్షుడిని  అయ్యానని ట్రంప్ చెబుతున్నారు.

అమెరికాలో ఎన్నికల ప్రచారం ముమ్మరం కావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు ప్రత్యర్థి జో బైడెన్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌ జన్మస్థలమైన పెన్సిల్వేనియాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం చేపట్టారు. అమెరికన్‌ కార్మికులను డెమొక్రాట్‌లు అమ్మేశారని విమర్శించారు. ఒకవేళ బైడెన్‌ అధికారంలోకి వస్తే మీకు పీడకలే అవుతారని అక్కడి ఓటర్లతో అన్నారు. గడిచిన అర్ధ శతాబ్దంగా వాషింగ్టన్‌లోనే గడుపుతున్న బైడెన్‌ దేశాన్ని అమ్మేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలు లాక్కోవడానికి డెమోక్రాట్లే కారణమన్నారు ట్రంప్.

జోబైడెన్‌ కూడా అధ్యక్షుడి తీరుపై మండిపడ్డారు. ప్రస్తుత అధ్యక్షుడు అమెరికాను చాలా కాలంపాటు చీకట్లోకి నెట్టివేశారని విమర్శించారు. చీకటి కాలాన్ని అంతం చేయడానికి ప్రతిజ్ఞ చేస్తున్నానని ‌పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ప్రచారంలో ఓట్లర్లను ఉద్దేశించి మాట్లాడిన బైడెన్.. తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటానని ఓటర్లకు భరోసా ఇచ్చారు. తీవ్ర విద్వేషం, విభజన వాదం, భయాలను సృష్టించే దారిలో అమెరికా వెళుతోందని, ఇలాంటి వాటినుంచి బయటపడేందుకు అందరూ ఏకం కావాలని జో బైడెన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న తీరును ఆయన తప్పుపట్టారు. ఈ విషయంలో ట్రంప్‌ తీరు క్షమించరానిదని మండిపడ్డారు.

ఇప్పటివరరకూ సర్వేల్లో జో బైడెన్.. ట్రంపై పై స్వల్ప ఆధిక్యతను కనబరుస్తున్నారు. కమలా హ్యారిస్ డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్ష అభ్యర్థి కావడం కూడా  బైడెన్ కు మేలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే సైలంట్ ఓటింగే తనను గట్టెక్కిస్తుందని ట్రంప్ నమ్మకంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: