కరోనా వైరస్ దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో డిపోలకే బస్సులు పరిమితమైపోయాయి. డ్రైవర్లు, సిబ్బంది కూడా డిపోలకు.. ఇళ్లకే పరిమితమైపోగా.. ప్రయాణీకులు ఆటోలకు, క్యాబ్ లకు అలవాటు పడిపోతున్నారు. వాళ్లు అడిగినంత సొమ్ము చెల్లిస్తూ జేబులకు చిల్లు పెట్టేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ వస్తుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్టీసీ నివేదిక అందగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోసం ఆర్టీసీ సిబ్బంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


భాగ్యనగరంలో సిటీ సర్వీసులను తిరిగి ప్రారంభించాలని ప్రజా సంఘాలు, ఇతరుల నుంచి విజ్ఞాపనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్నినెలల కిందట ఆర్టీసీ అధికారులు సిటీ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నా జీహెచ్‌ఎంసీలో కరోనా విజృంభణ ఆ ఆలోచనకు బ్రేక్ వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సిటి బస్సులు నడపాలా? వద్దా? అనే అయోమయ స్థితి నెలకొంటూ వచ్చింది. ప్రస్తుతం అంతరాష్ట్ర సర్వీసులతో పాటు హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉండటంతో.. సిటీ బస్సులను సైతం సెప్టెంబర్ మొదటివారంలో రోడ్డెక్కే విధంగా టిఎస్‌ఆర్టీసి పక్కా ప్లాన్ వేస్తోంది.  


సాధారణంగా హైదరాబాద్ నగరంలో దాదాపు 30లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కరోనాకు ముందు రాష్ట్రంలో ప్రతీ రోజూ 12కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం జిల్లా సర్వీసులు తిరుగుతున్నా రోజుకు 2కోట్ల రూపాయలు కూడా రావడం లేదు. ఈ దెబ్బకు ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం సిటీ బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పైగా ఆర్టీసీకి ఆదాయం లేకపోయినా.. ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల కోసం నెలనెలా 140కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: