బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. రియాను సుదీర్ఘంగా విచారించిన ఎన్‌సీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. రియా వాట్సాప్‌ చాట్‌ విచారణకు కీలకంగా మారనుంది. మరి కొంతమంది వీఐపీలు, బాలీవుడ్ ప్రముఖుల  పేర్లు కూడా బయటకొచ్చే అవకాశం ఉంది.  

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్న సుశాంత్‌కు సన్నిహితురాలైన రియాను మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది.  ఎన్‌సీబీ అధికారులు రియాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటికే రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని అరెస్టు చేయడంతో.. సోమవారమే ఆమెను సైతం అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేకుండానే విచారణ ముగించారు అధికారులు. విచారణకు రియా సహకరిస్తున్నారని తెలిపారు. మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని రియాకు సమన్లు జారీచేశారు. ఆదివారం 6 గంటల పాటు, సోమవారం 8గంటల పాటు రియాను ప్రశ్నించారు.

ఇప్పటికే షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాను అదుపులోకి తీసుకొన్న అధికారులు వీరు నిషేధిత మాదకద్రవ్యాలు పొందినట్టు చార్ట్‌ రికార్డులు ఉన్నట్టు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు రియాతో పాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. తాను డ్రగ్స్‌ తీసుకొచ్చానే తప్ప..వాడలేదని రియా ఇప్పటికే పలు వార్తా ఛానళ్ల ఇంటర్వ్యూలో చెప్పింది. సుశాంత్‌ గంజాయి వినియోగిస్తాడని తెలిపింది. ఎన్సీబీ విచారణలోనూ ఇదే సమాచారం చెప్పినట్టు తెలుస్తోంది.

సుశాంత్‌ మరణంపై నమోదైన కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు 28 ఏళ్ల రియాను విచారించిన సందర్భంలో ఆమె వాట్సాప్‌ చాట్‌ను పరిశీలించారు. అందులో డ్రగ్స్‌కు సంబంధించిన సంభాషణ ఉండటంతో ఈ కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ ఈ కేసులో రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించింది. ఐతే...తానేం చేసినా సుశాంత్‌ కోసమే చేశానని ఆమె సోమవారం ఎన్‌సీబీ అధికారుల వద్ద అన్నట్టు సమాచారం. సోమవారం నుంచి తన సోదరుడు షోవిక్‌తో పాటు రియా విచారణ ఎదుర్కొంటున్నారు. మొత్తానికి...రియా అరెస్టుతో బాలీవుడ్‌కు డ్రగ్స్‌ లింకులు మరిన్ని బయటపడే చాన్స్ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: