కొలువుల రూపంలో కోటికష్టాలు రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీకి అడుగడుగునా కష్టాలే కన్పిస్తున్నాయి. కనుచూపు మేరలో ఇవి తీరే పరస్థితులు కన్పించడం లేదు. పైగా ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ (ముందున్నది మొసళ్ల పండగ ) అన్నట్లుగా కార్యకర్తలకు,నాయకులకు పంచనున్న కొలువుల రూపంలో కోటికష్టాలు రానున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవానికి నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని ప్రధానకారణాల్లో ఒకటిగా పార్టీ సమన్వయ కమిటీ గుర్తించింది. 2014లో జరిగే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి పొరపాట్లన్నీ సరిదిద్దు కోవడంలో భాగంగా ఈపోస్టులను త్వరలో భర్తీచేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ పార్టీని మరింత పరేషాన్ చేసే అవకాశాలే ఎక్కువ కన్పిస్తున్నాయి. మంత్రిపదవితో సమానంగా ఉండే పలు రాష్ట్రస్థాయి పదవులతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో నేరుగా సంబందాలుండే జిల్లా,పట్టణ,మండలస్థాయి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ప్రధానంగా మార్కెట్ కమిటి చైర్మన్లు,దేవాలయాల కమిటి చైర్మన్లు వాటి డైరెక్టర్లు,ఐసిడిఎస్ రీజనల్ చైర్మన్లు,టెలికాంబోర్డు మెంబర్లు,ఇలా ఎన్నో క్షేత్రస్తాయిలో క్యాడర్ ను ప్రభావితం చేసే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇవన్నీ వైఎస్ఆర్ రెండవసారి సిఎం అయిన తొలిరోజుల్లోనే భర్తీచేయాలని భావించగా పార్టీలోని గ్రూప్ విభేధాల కారణంగా వాయిదా వేశారు. అనంతరం రోషయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టాక స్థానికంగా ఉన్న గ్రూప్ ల నాయకులు ఈపదవుల భర్తీకోసం ఆయనపై ఒత్తిళ్లు తేవడమే కాకుండా ఒక్కో పదవికోసం ఆయాగ్రూపులకు నాయకత్వం వహిస్తున్న నేతలు ఎవరికివారే వారి అనుచరుల పేర్లను సిఫార్సు చేయడంతో ఎవరికిస్తే ఏనాయకుడు చేజారతాడోనని రోషయ్య సైతం వాటి భర్తీ జోలికి పోలేదు. అప్పట్లో కూడా ఇటు జగన్ ప్రమాదం కాంగ్రేస్ కు పొంచి ఉంది. ఏవర్గానికి చెందిన వారికిస్తే మరో వర్గం జంప్  అవుతుందోనన్న భయం అప్పట్లో పొంచి ఉండడంతో పదవుల భర్తీ సాహసం ఆయన చేయలేదు. ఆతర్వాత వచ్చిన సిఎం కిరణ్ కుమార్ రెడ్డిది అదే పరిస్థితి. కాని ఇప్పుడు తప్పనిసరి భర్తీచేయాలి.అయితే పరిస్థితులు అప్పటికంటే జటిలంగా మారాయి. ఉపఎన్నికల పలితాలతో పదవులకోసం పాకులాడకుండానే పార్టీని వీడేందుకు రాష్ట్రంలో కీలక నేతలతో పాటు కార్యకర్తల వరకు కూడా గోడదూకి వైఎస్ఆర్ సిపిలోకి వెల్లేందుకు సిద్దమయ్యారన్న సమాచారం పార్టీ అధినేతలను కలవర పెడుతోంది. ఉదహరణకు పరిశీలిస్తే మాజిమంత్రి కోమటిరెడ్డి, ఆయన సన్నిహితుడు తెలంగాణ కాంగ్రేస్ ఎమ్మేల్యేల ఫోరం మాజి కన్వీనర్,ఆదిలాబాద్ మాజి ఎంపి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు తమ క్యాడర్ తో సహా వైఎస్ఆర్ సిపిలోకి వెలుతున్నట్లు దాదాపుగా ప్రత్యక్షసమాచారాన్నే చెప్పకనే చెప్పారు. ఇలాంటి పరిస్థితి ప్రజారాజ్యం సిటింగ్ ఎమ్మేల్ల్యేలున్నచోట నెలకొంది. ఇది పక్కన బెడితే ఇప్పటికే ఉన్న కాంగ్రేస్ గ్రూపులకు తోడు ఈపదవుల కోసం మరో గ్రూప్ రూపంలో ప్రజారాజ్యం నేతలు తయారయ్యారు. తమ వారిని కాంగ్రేస్ వారు ద్వితీయశ్రేణిగా గుర్తిస్థున్నారంటూ చిరంజీవి బహిరంగంగానే ప్రకటించారు. ఇక పదవుల విషయంలో ఆయన పార్టీ వారికి చోటు కల్పించాల్సిందే, ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడే ఆయన ప్రభుత్వం నిలబడడానికి ఆక్సీజన్ వలె తయారయ్యారు. ఇలాంటి నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీని బలోపేతం చేస్తుందా...మరింత బలహీన పరచి కొత్త కష్టాలు తెచ్చిపెడుతుందా అని ఆలోచిస్తే రెండవదే నిజమని చెప్పక తప్పదు. అందుకే అధికార కాంగ్రేస్ పార్టీకి ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఉందన్న మాటే.

మరింత సమాచారం తెలుసుకోండి: