సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై ఓవైపు సస్పెన్స్‌ కొనసాగుతుంటే మరోవైపు బాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తర్వాత అరెస్టు కాబోయేది దీపికా పదుకొణె, కరణ్‌ జోహార్‌ అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

సుశాంత్‌ సింగ్‌ది హత్యా? ఆత్మహత్యా? అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తోంది సీబీఐ. మరోవైపు మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేసిన ఈడీ.. డ్రగ్స్‌ కోణాన్ని గుర్తించింది. దీంతో రంగంలోకి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూర్‌ రంగంలోకి దిగడంతో వ్యవహారం అరెస్టుల వరకూ వెళ్లింది.

డ్రగ్స్ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హిందీ చిత్రపరిశ్రమలో పలువురికి గల సంబంధాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటికే  19 మందిని అరెస్ట్‌ చేసింది ఎన్సీబీ. దీంతో తర్వాత అరెస్ట్‌ చేయబోయేది ఎవరినీ అనే చర్చ జరుగుతోంది.  

దీపికా పదుకొణేతో పాటు సారా అలీ ఖాన్‌, శ్రద్ధాకపూర్‌ ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. తర్వాత అరెస్టు చేయబోయేది దీపికా పదుకొణే అనే టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే దీపిక మేనేజర్‌ కరిష్మాప్రకాశ్‌ నుంచి డ్రగ్స్‌ లింక్‌లకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. 2017లో పద్మావత్‌ చిత్ర నిర్మాణం సమయంలో డ్రగ్స్‌ గురించి దీపికా పదుకొణె, కరిష్మా ప్రకాష్‌ల మధ్య చాటింగ్ జరిగింది. దీనిపై దీపికాను లోతుగా ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.

డ్రగ్స్‌ వ్యవహారంలో దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. కరణ్‌ జోహార్‌ వద్ద ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేసే క్షితిజ్‌ రవిప్రసాద్‌ ఇంట్లో ఇప్పటికే ఎన్సీబీ సోదాలు నిర్వహించింది. విభిన్న అంశాలపై అతన్ని ప్రశ్నించింది. మరోవైపు 2019లో కరణ్‌ జోహార్‌ తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో డ్రగ్స్‌ సరఫరా చేశారంటూ శిరోమణి అకాలీదళ్‌ నేత మంజిందర్‌ సింగ్‌ సిర్సా ఆరోపిస్తున్నారు. ఈ పార్టీకి దీపికా పదుకొణే, అర్జున్‌ కపూర్‌, విక్కీ కౌషల్‌, వరుణ్‌ దావన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, మలైకా అరోరా సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారని ఎన్సీబీకి ఫిర్యాదు చేశారు మంజిందర్‌ సింగ్‌ సిర్సా. దీనిపై కరణ్‌ జోహార్‌కు త్వరలోనే ఎన్సీబీ సమన్లు జారీ చేస్తోందంటున్నారు సిర్సా.      

సుశాంత్‌ మృతిని ఆత్మహత్యగా మూసివేయడానికి ప్రయత్నించారు ముంబై పోలీసులు. ఆ సమయంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ బీహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు సుశాంత్‌ కుటుంబ సభ్యులు. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి బ్యాంక్‌ అకౌంట్‌కు 15 కోట్ల రూపాయలు తరలిపోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, సుశాంత్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఇంకా తేలకపోయినా డ్రగ్స్‌ కేసులో జైలుకెళ్లింది అతని ప్రియురాలు రియా చక్రవర్తి. ప్రస్తుతం రియా చక్రవర్తి, ఆమె సోదరుడు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. తమ వద్ద నుంచి ఎన్సీబీ అధికారులు ఎలాంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోలేదని బెయిల్‌ దరఖాస్తులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: