హాథ్రస్ ఘటనలో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలిపై అత్యాచారం జరగలేదన్న పోలీసుల వాదనలకు భిన్నంగా మెడికో లీగల్ నివేదిక వచ్చింది. అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ వైద్య కళాశాల ఇచ్చిన నివేదిక.. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు స్పష్టం చేసింది. అయితే యువతిపై అత్యాచారం జరగలేదని, తీవ్ర గాయాలతోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిందని యూపీ పోలీసులు చెప్పడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
హాథ్రస్ ఘటనలో బాధితురాలికి అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించడానికి గల కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. మరుసటి రోజు భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక ఆదారంగానే ఆ విధంగా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయమై యూపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించింది.
మరోవైపు.. హాథ్రస్ ఘటనపై ఐక్యరాజ్య సమితి కోఆర్డినేటర్ స్పందించడం.. కలకలం రేపింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా హింసాత్మక ఘటనలపై యూఎన్ కోఆర్డినేటర్ స్పందించడం అనవసరమని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఘటనపై విచారణ జరుగుతున్న వేళ.. ఓ బయటి సంస్థ వ్యాఖ్యలు చేయడం సరికాదని భారత్ హితవు పలికింది.
మరోవైపు.. ఈ ఘటనలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్ట్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కుల ఆధారిత హింసను ప్రేరేపించేందుకు కొన్ని సంస్థల నుంచి నిధులు సమకూర్చడం ... లాంటి ఆరోపణలు రావడంతో ఈ దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి