పోలవరంపై కేంద్రం తాజాగా ఇచ్చిన క్లారిటీతో ప్రాజెక్టే ప్రశ్నార్థకంలో పడిన పరిస్థితి. డీపీఆర్‌-2కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపే ఛాన్స్‌ ఉందనే భావనలో ఉన్న రాష్ట్రానికి షాక్‌ ఇచ్చింది కేంద్రం.  2014 నాటికి ఉన్న అంచనాల ప్రకారం 20 వేల కోట్ల రూపాయలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. దీంతో ఇప్పటి వరకు జరిపిన చెల్లింపులు మినహాయిస్తే.. రాష్ట్రానికి ఇక  రావాల్సింది కేవలం 7 వేల కోట్లే. తాజాగా కేంద్ర జలమంత్రిత్వ శాఖ మరో లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే పవర్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వబోమని మరోసారి స్పష్టం చేసింది.


పోలవరం ప్రాజెక్టులో భాగంగా పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం  సుమారు 3500 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా. దీనికి కేంద్రం నుంచి నిధులేవీ రాలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ తరహాలో లేఖ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నాయి ఇరిగేషన్‌ వర్గాలు. కేంద్రం తీరు చూస్తుంటే ఈ లేఖల వ్యవహరం పక్కా కవ్వింపు చర్య అన్నట్టుగానే ఉందనేది ఏపీ ప్రభుత్వ వర్గాల వాదన.  గతంలోనే చెప్పిన విధంగా పవర్‌ ప్రాజెక్టు కోసం కేంద్రం నిధుల కేటాయింపు జరపలేదు. ఇదంతా తెలిసి కూడా కేంద్రం ఈ తరహాలో లేఖ రాసిందంటే కచ్చితంగా కవ్వించినట్టుగానే ఉందనే భావన వ్యక్తమవుతోంది. ఓవైపు పాత అంచనాలకే పరిమితం అవుతామంటూనే..  ఇప్పుడు సంబంధం లేని అంశాలపై కేంద్రం ప్రత్యేకించి లేఖ రాయడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓవైపు కేంద్రాన్ని ఎలాగైనా ఒప్పించే దిశగా తాము ప్రయత్నిస్తుంటే.. అక్కర్లేని కొర్రీలు వేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం వైఖరేంటో అర్థమవుతుందంటున్నాయి ఇరిగేషన్‌ వర్గాలు.


పోలవరం ప్రాజెక్టు విషయంలో తాము చేయగలిగిందేమీ లేదని కేంద్ర ఆర్థిక, జల మంత్రిత్వ శాఖల అధికారులు స్పష్టంగా చెప్పేసినట్టు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్‌ రాజకీయంగా సెటిల్‌ కావాల్సిందే తప్ప.. అధికారుల స్థాయిలో ఈ పనయ్యే వ్యవహరం కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో అఫిషీయల్ లాబీయింగ్‌తోపాటు.. పొలిటికల్‌ లాబీయింగ్‌ కూడా చేస్తే తప్ప పోలవరానికి మోక్షం లభించదనేది ఇరిగేషన్ వర్గాల భావన.

మరింత సమాచారం తెలుసుకోండి: