రాజకీయ ఆరంగేట్రంపై పాతికేళ్ల మౌనానికి తలైవా రజినీకాంత్ తెర దించబోతున్నారా? ఒక వేళ పార్టీని కొత్తగా పెడతారా.. సింగిల్‌ గానే 234 స్థానాల్లో పోటీ చేస్తారా.. లేక బీజేపీ ..ఏఐడీఎంకే అలయెన్స్‌తో కలుస్తారా.. రజినీ అడుగు ఎటు పడబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. చూశారుగా... పైనా సినిమా సీన్‌లో చెప్పిన ఈ డౌట్స్‌..అభిమానులతో సహా ఎవరికీ క్లారిటీ రావడం లేదు. ఆయన పొలిటికల్‌ ఎంట్రీపై ఇంకా సస్పెన్స్ వీడలేదు.

చెన్నైలో అభిమానులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు తలైవా. దాంతో రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ వారికి మళ్లీ నిరాశే మిగిల్చారు రజనీకాంత్‌. రాజకీయ అరంగేట్రంపై ఎటూ తేల్చకుండానే సమావేశాన్ని ముగించారు. రెండుగంటల పాటు హాట్‌హాట్‌గా సాగిన ఈ సమావేశంలో.. రజినీకాంత్‌పై ఒత్తిడి చేశారు అభిమానులు. ఇప్పటికే లేట్ చేశామని.. ఇక మౌనం పనికిరాదని.. తేల్చిచెప్పారు.

సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చారు రజనీ. జిల్లా నేతలు వారి అభిప్రాయాలు చెప్పారని, తన అభిప్రాయాల్ని వారికి చెప్పానన్నారు. త్వరలోనే తన నిర్ణయం చెబుతానని ప్రకటించారు రజినీ.

మరికొన్ని నెలల్లోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కరుణానిధి తనయుడు అళగిరి కూడా పార్టీ ప్రకటించారు. దళపతి విజయ్ కూడా పార్టీ పెడుతున్నారన్న ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే రజనీ పొలిటికల్ ఎంట్రీపైనా వార్తలు వచ్చాయ్‌. తలైవా రాజకీయాల్లోకి రారని ప్రచారం జరిగింది. దీంతో అభిమానులు రజనీ ఇంటి ముందుకెళ్లారు. రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేశారు. దీంతో సోమవారం అభిమాన సంఘాలతో సమావేశం నిర్వహించిన రజనీ... వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఏ విషయం తేల్చకుండా... పదే పదే సమావేశాలు నిర్వహించడంతో ఇటు అభిమానుల్లోనూ నిరాశ నెలకొంది. తలైవా నాన్చుడు దోరణిపై బిన్నాభిప్రాయాలు విన్పిస్తున్నాయ్. మొత్తానికి రజినీకాంత్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారో అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: