పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచే తొలి నోటిఫికేషన్ ఎందుకు..?
పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల భర్తీ, మిగతా విభాగాల నియామకాలకంటే భిన్నంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో రిక్రూట్ మెంట్ కి ఎక్కువ సమయం పడుతుంది. రాత పరీక్షలతో పాటు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ లు కూడా జరపాల్సి రావడంతో సమయం మరింత అవసరం. ఇక అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలోనే నియామక ప్రకటన జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెలాఖరుకల్లా ప్రకటన విడుదల చేయగలిగితే నియామకాలు పూర్తిచేయడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. తర్వాత సంవత్సర కాలం శిక్షణ కొనసాగుతుంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రకటన విడుదలైతే అర్హత పొందిన వారు 2022 ఏప్రిల్ తర్వాతే ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంటుంది. అది కూడా అంతా అనుకున్న ప్రకారం జరిగితే అది సాధ్యమవుతుంది. ఈ కారణంగానే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పోలీసు అధికారులు నియామక ప్రక్రియ ప్రారంభించారు. అన్నీ అనుకూలంగా ఉంటే జనవరి నెలాఖరుకల్లా ఉద్యోగ ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది.
ఈసారి నియామక ప్రక్రియని మరింత సరళం చేసేందుకు.. ప్రత్యేక యాప్ రూపొందించాలని పోలీసు నియామక మండలి ఆలోచిస్తోంది. దీని ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నారు. తెలంగాణ పోలీసుశాఖలో ప్రస్తుతం 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పోస్టుల భర్తీని పోలీసు నియామక మండలి చేపడుతుంది. 2018 మేలో నియామక మండలి దాదాపు 16 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి రావడంతో అందుకు తగ్గట్టుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై దృష్టిపెట్టారు అధికారులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి