హామీల అమలులో కేసీఆర్ కూడా సగటు రాజకీయ నాయకుడిలాగే ఆలోచిస్తారనే అపవాదు ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల ప్రస్తావన చేసిన కేసీఆర్ ఆ తర్వతా అసెంబ్లీలో.. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలంటే సాధ్యమేనా అని ప్రశ్నించారు. మరి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇప్పించినట్టేనా అని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు గతంలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇటీవల హైదరాబాద్ లో వరద నష్టం పరిహారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలపాలైంది. సరిగ్గా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే ముందు పరిహారం ప్రకటించి, ఆ తర్వాత కోడ్ వల్ల అడ్డంకి ఎదురవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. ఆ నెపం ప్రతిపక్షాలపైకి నెట్టేయాలని చూసినా కుదరలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ టీమ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

కట్ చేస్తే.. ఇలాంటి వ్యవహారాలన్నిటికీ చెక్ పెట్టాలనుకుంటున్నారు కేటీఆర్. హామీల అమలుపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. ఇటీవల కేసీఆర్ మరో దఫా తెలంగాణ యువతకు ఉద్యోగాల హామీ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ ఫాలోఅప్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలు వంటివి వచ్చినా కూడా కోడ్ అడ్డంకి లేకుండా ఉద్యోగ నియామక ప్రక్రియ సజావుగా సాగేలా కేటీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వాసులకు ఉచిత తాగునీరు అందించే కార్యక్రమాన్ని కూడా కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. 2021 జనవరి నుంచి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకు రాబోతున్నట్టు ప్రకటించారు.

కొత్త ఏడాదికి ముందే హైదరాబాద్‌ నగర వాసులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జనవరి తొలి వారం నుంచే ఉచిత నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేయబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. రెండు రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డిసెంబరు నెల నుంచే 20 వేల లీటర్ల వరకు తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోబోమని, ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబరు బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఉచిత తాగునీటి హామీతోపాటు.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: