తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి మరియు బిజెపి పార్టీకి మధ్య అంతర్గత ఒప్పందాలు ఉన్నాయని.... పైకి రాజకీయ ఎత్తుగడలు బాగానే చూపించినా... తెరవెనుక ఒకరికొకరు సాయం చేసుకుంటూ రాష్ట్రంలో పన్నాగాలు పన్నుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేతలు. ఓసారి విమర్శించుకోవడం మరోసారి ప్రశ్నించుకోవడం అన్నీ మీకే తగునని   ఎత్తిచూపారు.అధికార పార్టీ చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. అయితే మరోవైపు ఇందుకు భిన్నంగా బండి సంజయ్ మాట్లాడుతూ అభివృద్ధి అభివృద్ధి అంటూ పైకి చెబుతూనే తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.

 కాలేశ్వరం పేరుతో కోట్ల రూపాయల ధనాన్ని మూటగట్టుకున్నాడు అంటూ...అవినీతిని బయటకు తీసి ఆయనను జైలుకు పంపుతామని
 ఇటీవలే ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కానీ ఇంకోవైపు ఏకంగా కేంద్ర మంత్రులే ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది. ఈ ఇరుపార్టీలు మిత్రపక్షాలే అని పైకి అన్నీ డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా  కేంద్ర మంత్రి జల్ శక్తి గజేంద్ర సింగ్  షెకావత్   తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. మిషన్ భగీరథ ఎంతో ప్రతిష్టాత్మక పథకమని.. ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమమని కొనియాడారు.

రాష్ట్రంలోని 100 శాతం ఇళ్లకు తాగునీరు అందించడం అంత చిన్న విషయమేమీ కాదని... అలాంటిది తెలంగాణ సర్కార్ సాధించి చూపించిందని   ప్రశంసలతో ముంచెత్తారు. ఎఫ్ హెచ్ టి సి (ఫంక్షనల్ హౌస్ ట్యాప్ కనెక్షన్) అంటే ఇంటింటికీ 100 శాతం తాగునీటి సౌకర్యం కల్పించడంలో గోవా మరియు తెలంగాణ రాష్ట్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ సందర్భంగా  ఆయన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ప్రశంసించారు. కాగా గజేంద్ర సింగ్ వీటికి స్పందించిన కేటీఆర్ ఓవైపు కృతజ్ఞతలు తెలుపుతూనే మరోవైపు చురకలు విసిరారు.

ఇది ప్రశంసించదగ్గ విషయమే... కానీ ఇందుకు మీరు ఏం చేశారో కాస్త చెబుతారా అన్నట్టుగా చురకలు అంటించారు. షెకావత్ జీ మీరు మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు. అయితే మాకు నీతి అయోగ్ ద్వారా ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా అందించలేదు. ఈ విషయాన్ని కూడా కాస్త గుర్తించండి’ అంటూ మంత్రి కేటీఆర్  స్పందించడం... కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించినట్లు అయింది. అయితే ఇందుకు కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ విషయం పై విమర్శలు గుప్పించడానికి సిద్ధంగా ఉండే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: