ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా పోరాడి సాధించాడు నిమ్మగడ్డ రమేష్. ఒకరకంగా ఇదంతా ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూలంగానే మొదలైందనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్ల హడావిడి మొదలైంది. నామినేషన్లు, ఓటర్ల జాబితాలు అంటూ పనుల్లో బిజీగా ఉంది ఎలక్షన్ యంత్రాంగం. ఇదిలా ఉండగా...రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఓ వింత పరిస్థితి ఎదురయ్యింది. ఎలక్షన్ కార్యక్రమాల్లో కీలకపాత్ర వహించే ఆయనకే ఏపీలో ఓటు హక్కు లేకుండా పోయింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విచిత్ర పరిస్థితి గురించి వివరించారు.

మొదట తనకు హైదరాబాదులో ఓటు ఉండేదని.. అయితే దాన్ని సరెండర్ చేసి తన సొంత ఊరైన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు  చేసినట్లు తెలిపారు. అయితే వెరిఫికేషన్ లో భాగంగా ఓ సారి తమ వద్ద హాజరుకావాలని స్థానిక తహసీల్దార్ తెలిపారని, కానీ అదే సమయంలో చీఫ్ సెక్రటరీతో సమావేశం కారణంగా హాజరుకాలేకపోయానన్నారు. వెరిఫికేషన్ కోసం మరో రోజు తనకు అవకాశం కల్పించమని కోరినా వారు పట్టించుకోలేదన్నారు. ఓటు హక్కు కోసం కలెక్టర్‌ను కలిపి విజ్ఞప్తి చేస్తానన్న ఎస్ఈసీ, అవసరం అయితే కోర్టుకు కూడా  వెళతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏకగ్రీవం అంశంపై గళమెత్తారు నిమ్మగడ్డ రమేష్.

ఏకగ్రీవాలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మీద నిమ్మగడ్డ విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల షెడ్యూల్ ఒకసారి విడుదల అయింది అంటే... ఇక దాని గురించి ఏ ప్రకటన చేయాలన్నా  ముందుగా ఎలక్షన్ కమిషన్‌ను సంప్రదించాలని.. అంతే తప్ప ఇలా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎన్నికలను ప్రభావితం చేసే ఇటువంటి కీలక ప్రకటన చేయడం సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నిమ్మగడ్డ. మరి ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవాలు చేసే ప్రోత్సాహకాలు మాట ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. జగన్ అనుకుంది చేయడానికి ఎంత దూరమైనా వెళతాడని తెలిసిన విషయమే. మరి ఏమి జరుగుతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: