తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11మంది మృతిచెందిన ఘటనపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం కేవలం 11మంది మాత్రమే చనిపోయారంటున్నా.. ప్రతిపక్షాలు మాత్రం మృతుల సంఖ్యను అధికారులు తొక్కిపెట్టారని, తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాల వాదనకు బలం చేకూర్చేలా ఉంది. రుయా ఘటనలో 11కుటుంబాలతోపాటు, మరో 12 కుటుంబాలకు కూడా అదనంగా పరిహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం విశేషం.

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈనెల 10న ఆక్సిజన్‌ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలువురు కరోనా రోగులు మరణించారు. 11మంది మాత్రమే ఆక్సిజన్ అందక చనిపోయారని అధికారులు చెబుతున్న సమాచారం. దీని ప్రకారం ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబాల వద్దకు నేరుగా వెళ్లి పరిహారం చెక్కులు అందించాలని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యాన్ని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు సీఎం జగన్. ఆ ప్రకారమే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పటికే కొంతమందికి నష్టపరిహారం అందించారు కూడా.

ప్రతిపక్షాలు మాత్రం దీనిపై న్యాయపోరాటానికి దిగాయి. కాంగ్రెస్ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు గవర్నర్ కి లేఖ రాయడంతోపాటు, న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 12 మందికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసింది. తొలుత ప్రకటించిన 11 మందితో పాటు ఇప్పుడు మంజూరు చేసిన వారిని కలిపితే మొత్తం 23 మంది ఈ దుర్ఘటనలో చనిపోయినట్లు స్పష్టమవుతోంది. అయితే ఆరోజు జరిగిన దుర్ఘటనలో వీరంతా చనిపోయారని చెప్పడానికి మాత్రం అధికారులు జంకుతున్నారు. ఆక్సిజన్ అందక ఆరోజు 11మంది మాత్రమే చనిపోయారని, ఆ ప్రభావం వల్ల తర్వాత మరికొందరు మృతి చెందారని అంటున్నారు. వారి వివరాలు కూడా పంపాలని కలెక్టర్ కోరడంతో.. తాము 12మంది సమాచారం ఇచ్చామని ఆస్పత్రి అధికారులంటున్నారు. అంటే రుయా ఘటనలో తాము చెబుతున్న లెక్కలు తప్పని పరోక్షంగా ప్రభుత్వమే ఒప్పుకున్నట్టయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: