2డీజీ ఔషధాన్ని గర్భిణులు, బాలింతలకు వాడకూడదని డీఆర్డీవో కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 18ఏళ్ల లోపు వారికి కూడా ఈమందు వినియోగించకూడదు. తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడేవారు, షుగర్ లెవల్స్ బాగా ఎక్కువగా ఉన్నవారికి కూడా ఇది వాడకూడదు. మూత్రపిండాల వ్యాధి, లివర్ సమస్యలున్నవారిపై ప్రయోగాలు జరగలేదు కాబట్టి.. వారిని కూడా లిస్ట్ లోనుంచి తీసేయాలని అన్నారు. ఇక మిగతా వారికి మాత్రం కరోనా వైరస్ సోసిన 10రోజుల్లోపు 2డీజీ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు డీఆర్డీవో శాస్త్రవేత్తలు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో 2డీజీ ఔషధాన్ని వాడిన రోగులు రెండున్నర రోజులు ముందే కోలుకున్నారని, ఆక్సిజన్ పై ఆధారపడే అవసరం 42శాతం తగ్గిందని తెలిపారు.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 2డీజీ ఔషధాన్ని మార్కెట్ చేస్తోంది. ప్యాకెట్ రూపంలో ఉండే ఈ పౌడర్ ని నీళ్లలో కలుపుకొని తాగాలి. అయితే ప్రస్తుతం డాక్టర్లు సిఫార్సు చేస్తేనే దీన్ని వినియోగించాల్సి ఉంటుంది. బయట మెడికల్ షాపుల్లో అప్పుడే ఇది అందుబాటులోకి రాకపోవచ్చు. డాక్టర్ రెడ్డీస్ సంస్థను నేరుగా ఆస్పత్రులు సంప్రదిస్తే వారికి మాత్రమే ఇస్తున్నారు. కరోనా రోగులు ఎవరికి వారే దీన్ని వినియోగించడం ఇప్పుడప్పుడే కుదిరేలా లేదు. ప్రస్తుతానికి డాక్టర్ల పర్యవేక్షణలోనే 2డీజీ ఔషధాన్ని వాడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటోంది. మరిన్ని పరిశోధనలు జరిగి ఇతర అన్నిరకాల వ్యాధిగ్రస్తులు కూడా 2డీజీ ఔషధాన్ని వినియోగించే అవకాశం ఉంటే.. మరింత ఉపయోగం ఉంటుంది. దీనిపై డీఆర్డీవో కూడా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి