మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ఈటెల రాజేందర్ రాజీనామాతో ఆయన సొంత నియోజకవర్గంలో... ఉప ఎన్నిక అనివార్యం అయింది.  దీంతో అన్ని పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గం లోనే పాగా వేశాయి. గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ మరియు విపక్షాలైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు కూడా తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. అటు ఈటల రాజేందర్ ఒక అడుగు ముందుకేసి... పాదయాత్రను కూడా మొదలు పెట్టేసాడు. ఇటు టిఆర్ఎస్ పార్టీ... కూడా  మంత్రులను ప్రచారంలోకి దిగింది. దీంతో ఉప ఎన్నిక రసవత్తరం గా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.

బిజెపి పార్టీ తరఫున ఈటెల రాజేందర్ లేదా ఆయన భార్య పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి బయటకు వెళ్లడంతో... హుజురాబాద్ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలనే దాని పై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే పలువురు నాయకుల పేర్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్నాయి. మొదట్లో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చి గులాబీ పార్టీకి జై కొట్టారు.  దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారని ప్రశ్న తలెత్తుతోంది. అయితే తాజాగా ఉమ్మడి కరీంనగర్ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

కేకే మహేందర్ రెడ్డి... కాంగ్రెస్ సీనియర్ నాయకులు. అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు మూడు సార్లు కేటీఆర్ పై పోటీ చేసిన నాయకుడు కెకె మహేందర్ రెడ్డి. క్రమశిక్షణ, ప్రజల్లో ఆదరణ ఉండటంతో కేకే మహేందర్ రెడ్డిని.... హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై కొత్తగా ఎంపికైన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రపోజల్ ను కూడా  కేకే మహేందర్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా తమ అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించలేదు. టిఆర్ఎస్ పార్టీ తరఫున కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారని.. జోరుగా ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: