రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పార్టీలు మారుస్తూ సక్సెస్ అయ్యే నేతలు చాలా తక్కువగా ఉంటారు. పైగా ప్రతి ఎన్నికల్లోనూ నియోజకవర్గాలు కూడా మార్చి గెలవడం కూడా అంత సులువు కాదు. కానీ ఈ రెండు విషయాల్లోనూ సక్సెస్ అయిన నేత ఎవరైనా ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ ద్వారా గంటా రాజకీయాల్లోకి వచ్చి....1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీకి వెళ్ళి అక్కడ టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.


ఇక 2009 ఎన్నికల్లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళి, అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో, కొన్ని రోజులు మంత్రిగా కూడా పనిచేశారు. మళ్ళీ 2014 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి, ఈ సారి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి, చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలోచ్చేసరికి మరొకసారి నియోజకవర్గాన్ని మార్చేశారు. ఈ సారి విశాఖ నార్త్ నుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు.


కానీ టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో, పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పటికే అనేకసార్లు గంటా వైసీపీలోకి వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాకపోతే గంటా, వైసీపీలోకి రావడాన్ని విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌లు అడ్డుకుంటున్నారని కథనాలు కూడా వస్తున్నాయి. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా..తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు.


అలా అని స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయడం లేదు....టీడీపీలో యాక్టివ్‌గా ఉండటం లేదు...వేరే పార్టీలో చేరలేదు...అలాగే ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు. ఇలా అధికారంలో లేకపోతే సేఫ్‌గా రాజకీయం చేస్తున్న గంటాకు ఈ సారి మాత్రం గడ్డు పరిస్తితి ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ సారి గంటా ఏ పార్టీ తరుపున పోటీ చేసినా, ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా సరే ఓడిపోవడం ఖాయమని, గంటా మీద విశాఖ ప్రజలకు ఉన్న నమ్మకం పోయిందని పలువురు రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: